కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి వెల్లడించారు. దమ్ముంటే భాజపా, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక వద్ద కేటీఆర్ అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం నిర్మించిన రైతువేదికను మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం కొదురుపాక జంక్షన్ రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు.
చిన్ననాటి జ్ఞాపకాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనుకోని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతువేదిక ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ కొదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు ప్రతి వేసవికాలంలో ఇక్కడికి వచ్చేవాడినని... తాతయ్య చనిపోయినప్పుడు తాను ఇక్కడ లేనని... అది చాలా బాధను కలిగించిందని ఆవేదనకు గురయ్యారు. గతంలో ఆ ప్రాంతంలో కరువు తాండవమాడేదని... ప్రస్తుతం అక్కడ భూగర్భజలమట్టం ఆరు మీటర్లు పెరిగిందనే విషయాన్ని ముస్సోరీలో కాబోయే ఐఏఎస్‌లకు పాఠాలుగా చెబుతున్నారన్నారు. సిరిసిల్ల మీదుగా కరీంనగర్ వరకు రైలు మార్గం కూడా రాబోతోందన్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు..
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు దేశంలోని ఏ ప్రాంతంలో లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతును రాజును చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. నోరుందని ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు. పంజాబ్‌ను దాటి రాష్ట్రంలో ధాన్యం అధికంగా పండించిందంటే అది కేసీఆర్ కృషి వల్ల కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2600 రైతు వేదికలను నిర్మించుకున్నామని... ఆ వేదికల్లో రైతులు సంఘటితమై చర్చించుకోవాలని సూచించారు.