KTR on PM Modi: అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణకు అర పైసా సాయం చేయకుండా.. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తల భేటీలో కేటీఆర్ పాల్గొన్నారు. సమగ్ర అభివృద్ధితో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణపై అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఇటీవల నరేంద్రమోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాపీ కొట్టి...
తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న భాజపా నేతలకు ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండాలా? వద్దా? ఆలోచించుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. మిషన్ భగీరథకు రూ.14 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే.. తెలంగాణకు మోదీ 24 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని సిగ్గులేకుండా కాపీ కొట్టి హర్.. ఘర్.. జల్ అని డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. 2014లో ఒక్కో భారతీయుడి ఖాతాలో రూ.16 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు.. ఎవరి ఖాతాలో అయినా రూ.16 లక్షలు వేశారా? ఏటా 2కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు.
అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్నారు. భాజపా, మోదీకి జవాబివ్వాల్సిన బాధ్యత కార్యకర్తలదే. 2014లో నమో (నరేంద్ర మోదీ) పేరిట ఓట్లు అడిగారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని ప్రచారం చేయాలి. మోదీ కేవలం ఉత్తర భారత్, ఉత్తరాఖండ్‌కే ప్రధానా? తెలంగాణకు వేరే ప్రధాని ఉన్నారా? అని నిలదీయాలి.