Maha Shivratri Celebrations in Telangana: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం గణేశ్ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు రుద్రాభిషేకాలు నిర్వహించనుండగా.. భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి శుక్రవారం నుంచే భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం రాత్రి 11 గంటల నుంచి క్యూలైన్‌లలో వేచి ఉన్నారు. అయితే ఆలయ అధికారులు స్వామివారి దర్శనం నిలిపివేయడంతో ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చివరకు తెల్లవారుజాము నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వడంతో శాంతించారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకి సంగమేశ్వర ఆలయంలోనూ శివరాత్రి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పార్వతీ సమేత సంగమేశ్వరుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా శివుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ అమృత గుండంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. పార్వతీ సమేత సంగమేశ్వరుని దర్శించుకుని పునీతులు అవుతున్నారు. భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్ డిపో నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
Maha Shivratri Celebrations in Warangal..: వరంగల్ నగరంలోని శివాలయాలకూ భక్తులు పోటెత్తారు. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయానికి ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ముందుగా రుద్రేశ్వరునికి అర్చకులు ఉత్తరాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. రుద్రేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. ఓం నమ:శివాయ అంటూ భక్తులు చేస్తోన్న శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఖిలా వరంగల్ కోటలోని స్వయంభు ఆలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొర్రె కుంటలోని కోటిలింగాల ఆలయంలో బిల్వపత్రాలతో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అభిషేకం చేసేందుకు అవకాశం కల్పించారు.