Mahashivratri at Vemulawada Temple : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ వేల కోట్లరూపాయలు కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల కొండగట్టుకు వెళ్లిన సీఎం ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారని.. ఇంకా కావాలిస్తే మరికొన్ని నిధులు మంజూరు చేస్తామన్నారని వెల్లడించారు.. వేములవాడకు రూ.67 కోట్లు, గుడిచెరువుకు రూ.37కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు.
Mahashivratri celebrations in Vemulawada : వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో భక్తులు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్యూలైన్లలో తాగడానికి కనీసం మంచినీళ్లు లేవని.. రాత్రి 10 గంటల నుంచి నిలబడితే ఇవాళ ఉదయం 10 గంటలైనా స్వామివారి దర్శనానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చంటి పిల్లలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓవైపు వీఐపీల తాకిడి మరోవైపు పోలీసుల కుటుంబాలకే స్వామివారి దర్శనం జరిపించడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడకు వస్తే కనీస వసతులు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం రాజన్న ఆలయంలో ఉచిత దర్శనానికి 10గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు.
Godavari River Baths in Manthani: శివరాత్రి కావడంతో పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. గోదావరిలో పుణ్యస్నానాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. గౌతమేశ్వరస్వామి, బిక్షేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల పూజలు చేశారు. రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిపివేయడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. గోదావరి పుణ్యస్నానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఎమ్మెల్యే స్వయంగా కారు దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Shivratri celebrations in Nirmal: శివరాత్రి పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోను శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని ప్రముఖ శివక్షేత్రాలు ఓం కారేశ్వర, నగరేశ్వర శివాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు భక్తులు నిర్వహిస్తున్నారు. కదిలి, బూర్గుపెల్లి, కాల్వ గ్రామాల్లోని శివాలయాలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.