రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిషరీస్ విశ్వవిద్యాలయ స్థాపన కోసం రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్ క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేశారు. తంగళ్లపల్లి మండలం చీర్ల వంచ దగ్గర ప్రతిపాదిత ఆక్వాహబ్లో సుమారు 300 ఎకరాలలో ఫిషరీస్ యూనివర్సిటీ స్థాపనకు ఏర్పాటు చేసిన స్థలాన్ని పశువైద్య అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఆక్వాహబ్లో చేపట్టబోయే ప్రతిపాదిత పనుల గురించి పలు కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యదర్శికి వివరించారు. యూనివర్సిటీ స్థాపనకు రాజరాజేశ్వర జలాశయ ప్రాంతం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆమె తెలిపారు. క్షేత్రస్థాయి రిపోర్టును ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.