KTR Rajanna Sircilla Tour Today : అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం గుప్పిస్తూ.. ఒకరి వైఫల్యాలు మరొకరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ఒకటే పాట పాడుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో పడింది. వాటిలో ప్రధాన హామీ అయిన పోడు పట్టాల పంపిణీని సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పోడు పట్టాలను లబ్ధిదారులకు అందించారు.
KTR Comments at Sircilla Meeting : మొదట జిల్లాలోని తంగళ్లపల్లిలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అదేవిధంగా కళాశాలకు బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాలగా పేరు మార్పు చేశారు. అనంతరంపోడు భూముల పట్టాల పంపిణీకార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్.. రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశారని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. కుమురం భీం నినాదం జల్, జంగిల్, జమీన్‌ను సాకారం చేస్తున్నామని తెలిపారు.