KTR Pressmeet on Textiles: చేనేత రంగాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో చేనేత రంగ అభివృద్ధికి తెరాస సర్కార్ పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. చేనేత కళాకారులకు ఉపాధి కల్పించడంతోపాటు మరెన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పట్ల చేనేత, జౌళి పరిశ్రమ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం మాత్రం సహకారం అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఎన్ని ప్రతిపాదనలు చేసినా... పట్టించుకోవడం లేదన్నారు.
పని చేస్తున్న ప్రభుత్వానికి, పని చేస్తున్న రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్న రంగానికి అండాదండగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వ మాత్రం అందుకు సహకరించట్లేదు. ఏడు సంవత్సరాలుగా ఎన్ని ప్రతి పాదనలు పంపినా కేంద్రం పట్టించుకోవట్లేదు. మా చేనేత కళాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే విధంగా.. రాష్ట్రంలోని చేనేత సమూహాల దగ్గర ''ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ'' అనేది ఏర్పాటు చేయాలని కోరాం. ఇంతవరకు స్పందన లేదు.
టెక్స్టైల్ రంగంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ వెనుకబడి ఉంది. ఈ క్రమంలో భారతదేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌ను, 1200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ టెక్స్టైల్ పార్క్‌తో చేనేత రంగంలో ప్రపంచంతో పోటీ పడేందుకు వీలు ఉంటుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచి మెగా టెక్స్టైల్ పార్కుకు ప్రత్యేకంగా రూ.1000 కోట్లు మంజూరు చేయమని అడిగాం. ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు.