KTR fires on Modi Govt: సిరిసిల్లలో పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ‘వ్యవసాయం, విద్యుత్‌ను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విద్యుత్, వ్యవసాయంపై కక్షగట్టిందని మండిపడ్డారు. ధాన్యం సేకరణ వల్ల నష్టం వస్తోందని చెబుతూ దానిని ప్రైవేటుపరం చేసేలా కేంద్ర సాగు కార్యదర్శి సుధాన్షు పాండే చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని ప్రకటన చేయడం దారుణమన్ని మంత్రి మండిపడ్డారు.
‘ఆహార భద్రతా చట్టం ప్రకారం రాష్ట్రాలు పండించే ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే. దానికి మంగళం పాడటమే కాకుండా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎలాంటి చర్చలు లేకుండా చట్టాలు గెజిట్‌లు తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. కుక్కను చంపే ముందు పిచ్చికుక్క అని ప్రచారం చేస్తారనే సామెత మాదిరిగానే... విద్యుత్తు, వ్యవసాయ విధానంపై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన మిత్రుడిని అపరకుబేరుడిగా చేసే వరకు ప్రధాని మోదీ నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.