Public Health Index in Telangana : తెలంగాణ ప్రజల ఆరోగ్య సూచీలను(హెల్త్ ప్రొఫైల్స్) భద్రపరిచే కార్యక్రమానికి మార్చి 5న శ్రీకారం చుట్టనున్నారు. ప్రయోగాత్మకంగా తొలుత రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లో ప్రారంభానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ టి.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది డిసెంబరులోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినా.. కొవిడ్ మూడోదశ ఉద్ధృతి ప్రభావం, సమ్మక్క సారలమ్మ జాతర తదితర కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా అదుపులో ఉండడం, జాతర ముగిసిపోవడంతో రెండు జిల్లాల్లో ఆరోగ్యసూచీల సేకరణను ప్రారంభించడానికి నిర్ణయానికొచ్చారు. ఆరోగ్య సూచీలను గుర్తించడానికి అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలను, ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి తొలి విడతగా రూ.9,15,76,713 నిధులను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. అవసరాలను బట్టి ఎప్పటికప్పుడూ నిధులను విడుదల చేస్తుంటారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
Telangana Public Health Index : తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) పరికరాలను కొనుగోలు చేసి, ఆయా జిల్లాలకు సరఫరా చేసింది. ఆరోగ్య సూచీల్లో అనుసరించాల్సిన విధానాలపై వైద్యసిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా ఇప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 212 వైద్య బృందాలు, ములుగు జిల్లాలో 153 బృందాలు పనిచేస్తాయి. గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి.. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచీని సేకరిస్తారు. వాటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. ప్రజల నుంచి రక్త, మూత్ర నమూనాలనూ సేకరిస్తారు. వాటిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షిస్తారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి ఆరోగ్య సూచీని తెలుసుకునే అవకాశం ఉంటుంది.
పీహెచ్‌సీల్లో చేసేవి..
- పరిపూర్ణ రక్త పరీక్ష(సీబీపీ)
- సంపూర్ణ మూత్రపరీక్ష(సీయూఈ)
- మూత్రపిండాల పనితీరును తెలుసుకునేలా అల్బుమిన్, బ్లడ్ యూరియా, సీరమ్ క్రియేటినైన్, ఆల్కలైన్ ఫాస్ఫటేజ్(ఏఎల్‌పీ)
- రక్తంలో షుగర్ స్థాయి, మూడు నెలల చక్కెర స్థాయి
- కాలేయ పనితీరును తెలుసుకొనే టోటల్ బిల్‌రుబిన్, డైరెక్ట్ బిల్‌రుబిన్, ఎస్‌జీపీటీ, ఎస్‌జీవోటీ
- కొలెస్ట్రాల్ స్థాయులను కనుగొనే టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్
- గుండె పనితీరును ప్రాథమికంగా కనుగొనేందుకు ఈసీజీ