పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్లలోని 134 వస్త్ర పరిశ్రమలను వరద ముంచెత్తింది. వస్త్రోత్పత్తులు, ముడిసరకులు తడిసిపోయాయి. వరదల నుంచి తేరుకునేందుకు నాలుగు రోజులు పట్టింది. విద్యుత్తు సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ అయ్యేసరికి మరో పది రోజులు గడిచాయి. ఈ ఏడాది చీరల కొంగు అంచులపై బంగారు వర్ణంలో డిజైన్లు రూపొందించేందుకు ఒక్కో మరమగ్గానికి సుమారు రూ.20 వేల చొప్పున వెచ్చించి డాబీ, జకాట్ పరికరాలు అమర్చారు. ఆపై వరదల కారణంగా నష్టం వాటిల్లడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. వస్త్రోత్పత్తులు, నూలు, ముడి సరకులను ఆరబెట్టడంతోపాటు మరమగ్గాల విడిభాగాలు, విద్యుత్తు మోటార్లకు మరమ్మతులు చేయిస్తున్నారు.
నిధుల కోసం ఎదురుచూపులు
బతుకమ్మ చీరల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.330 కోట్లు కేటాయిస్తోంది. వస్త్రోత్పత్తులకు రూ.212 కోట్లు, ప్రాసెసింగ్, ప్యాకింగ్, రవాణా, తాత్కాలిక ఉద్యోగుల వేతనాలకు రూ.118 కోట్లు చెల్లిస్తుంది. టెస్కో ఇప్పటివరకు సేకరించిన 5.25 కోట్ల మీటర్లకు మొత్తం రూ.330 కోట్లలో 50 శాతం చెల్లించాల్సి ఉండగా.. ఈ నెల 13న రూ.30 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులోని యూనిట్లకు 30 శాతం, పట్టణంలోని ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు 20 శాతం, రవాణా, ప్రాసెసింగ్ తదితరాలకు మిగతా మొత్తం కేటాయించారు. అత్యధిక పరిశ్రమలకు నిధుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. 14 వేల మరమగ్గాలు చీరలను ఉత్పత్తి చేస్తుండగా.. 8 వేల మంది కార్మికులు ఉపాధి పనిచేస్తున్నారు. పెట్టుబడులు, కార్మికుల వేతనాలకు యజమానులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరమగ్గాల విద్యుత్తు మోటార్లలోకి నీరు చేరడంతో సుమారు రూ.34 లక్షల నష్టం వాటిల్లిందని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని చేనేత, జౌళిశాఖ ఏడీ సాగర్ తెలిపారు. లక్ష్యం పూర్తయ్యేవరకు చీరల సేకరణ కొనసాగుతుందని పేర్కొన్నారు.