రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్(CHENNAMANENI CITIZENSHIP DISPUTE) పౌరసత్వం వివాదంపై ఆన్లైన్లో కాకుండా ప్రత్యక్ష విచారణ(DIRECT TRIAL) చేపట్టనున్నట్లు హైకోర్టు(TS HIGH COURT) తెలిపింది. చెన్నమనేని రమేశ్ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఇవాళ ఆన్లైన్ ద్వారా మరోసారి విచారణ చేపట్టారు.
అభ్యంతరాలు
అనేక దస్త్రాలు, చట్టాలను పరిశీలించాల్సి ఉన్నందున ఆన్లైన్లో వాదనలు కష్టంగా ఉంటుందని.. ప్రత్యక్ష విచారణ జరపాలని చెన్నమనేని తరఫు న్యాయవాది వై. రామారావు ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎత్తుగడలు వేస్తున్నారు
చెన్నమనేని పౌరసత్వంపై ఉద్దేశపూర్వకంగానే విచారణ జాప్యం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది రవికిరణ్ రావు వాదించారు. ఆన్లైన్లో విచారణ జరపడం కష్టమేమీ కాదని... స్టే ఉత్తర్వులు ఉన్నందున కాలం వెళ్లదీసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. చెన్నమనేని జర్మనీ పౌరుడేనని... ఓసీఐ కార్డు ద్వారానే భారత్కు వచ్చి వెళ్తున్నారని పేర్కొన్నారు. తమ పౌరుడేనని జర్మనీ(GERMAN CITIZENSHIP) ధ్రువీకరించాలని.. లేదా విచారణ అనంతరం భారత ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంటుందంటూ ఆది శ్రీనివాస్ చేసిన వాదనపై చెన్నమనేని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రత్యక్ష విచారణ
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్పై కోర్టులో ప్రత్యక్ష విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అనంతరం విచారణను అక్టోబరు 21కి వాయిదా వేసింది.
చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:Telangana assembly sessions 2021 : శాసనసభ సమావేశాల్లో ఏమేం చర్చిద్దాం? ఏఏ బిల్లులు ప్రవేశ పెడదాం?