రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సిరిసిల్ల పట్టణంలోని ప్రగతి నగర్, పాత బస్టాండ్, సాయినగర్, అంబికానగర్ తదితర కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఫలితంగా జన జీవనం స్తంభించి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత బస్టాండ్, కొత్తచెరువు ప్రాంతాల్లో భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. సిరిసిల్లలోని వెంకంపేట, ప్రగతినగర్, సాయినగర్ సహా ఇతర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పట్టణంలోని పలు కాలనీల్లోకి ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ప్రత్యేక కంట్రోల్ రూం..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. కొత్త చెరువు మత్తడి దూకడంతో సిరిసిల్ల - కరీంనగర్ రహదారిలోని దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. భవనాల సెల్లార్లలో భారీగా నీరు చేరి.. దుకాణాలు తెరచుకోలేని పరిస్థితి నెలకొంది. కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అందులోని సామగ్రి పూర్తిగా నీట మునిగాయి. 111 చెరువులు, కుంటలు వరద నీటితో మత్తడి దూకుతున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటుచేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. జిల్లాలో వర్షాల కారణంగా ఆస్తి, పంట నష్టాల వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం 9398684240 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
హనుమకొండ- ములుగు మధ్య రాకపోకలకు అంతరాయం..
రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోని నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువులు, జలాశయాలు నిండి మత్తడి పోస్తున్నాయి. హనుమకొండలో భారీ వర్షాలతో కాలనీలు జలమయమయ్యాయి. కటాక్షాపూర్ చెరువు మత్తడి పోస్తుండటంతో హనుమకొండ-ములుగు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
రంగంలోకి డిజాస్టర్ టీం..
కాశీబుగ్గలోని మధురానగర్ లక్ష్మి గణపతి కాలనీ వివేకానంద కాలనీలు నీటమునగగా.. హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ బృందావన కాలనీలో ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లలో చిక్కుకుపోయిన వృద్ధులను వరంగల్ మహానగర పాలక సంస్థ డిజాస్టర్ టీం సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖిలా వరంగల్ రాతికోట సమీపంలోని అగర్తల చెరువు మత్తడి పోయడం వల్ల శివనగర్ మైసయ్య నగర్ కాలనీలోకి వరదనీరు చేరింది. ఉర్సు రంగసముద్రంతో పాటు భద్రకాళి జలాశయం అలుగు పారడంతో దిగువన ఉన్న కాపువాడ కాలనీ రహదారులపై వరద నీరు ప్రవహిస్తుంది. కాలనీలు నీటమునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నీట మునిగిన విద్యుత్ సబ్ స్టేషన్..
నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి హనుమకొండ జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ వంద అడుగుల రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అమరావతి నగర్ కాలనీలోకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాల్పూర్, సమ్మయ్యనగర్, ద్వారక కాలనీ, ఎన్జీవో కాలనీ, గోకుల్ నగర్ తదితర కాలనీలో వరద నీరు వచ్చి చేరింది. వడ్డెపల్లి చెరువు నిండి పోయి ఆ నీరంతా హనుమకొండలోని నాలాల గుండా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోపాల్పూర్ విద్యుత్ సబ్స్టేషన్ నీట మునగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వరదలో చిక్కుకున్న లారీ..
పంతిని చెరువు అలుగు పారడంతో... వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారి జలమయం అయింది. నాలుగు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ఖమ్మం వైపు వెళ్తున్న ఓ లారీ వరదలో చిక్కుకుంది. లారీని తొలగించేందుకు పోలీసులు, గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు. ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం వల్ల జాతీయ రహదారిపై హనుమకొండ జిల్లా నుంచి ములుగు జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
పంట చేనులోకి చేపలు..
జోరు వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా తడిసి ముద్దయింది. భారీగా కురుస్తున్న వర్షానికి చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు పంట చేనుల్లోకి చేరి భారీగా నష్టం వాటిల్లింది. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదతో పాటు చేనులోకి చేపలు రాగా.. గ్రామస్థులు వలలతో పడుతున్నారు.
దుకాణ సముదాయాల్లోకి వరద..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వానపడింది. భారీ వర్షం కారణంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లు.. అంబేడ్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా వరద నీటితో నిండిపోయింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరింది.
నీటమునిగిన ఆలయం..