నైరుతి రుతుపవనాల ప్రభావంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rain Effect in Sircilla) ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నీటి మునిగింది. ఎడతెరిపిలేని వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. వరద నీటితో చాలా కాలనీలు జలమయమయ్యాయి. పాతబస్టాండ్ ప్రాంగణం చెరువును తలపిస్తోంది. ప్రగతినగర్, సాయినగర్... అంబికానగర్, శాంతినగర్, గాంధీనగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
చెరువులు మత్తడి దూకడంతో..
సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంకంపేట, ప్రగతి నగర్, సాయి నగర్ ఇతర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పట్టణంలోని పలు కాలనీల్లో ప్రవహించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొత్త చెరువు మత్తడి దూకడంతో సిరిసిల్ల-కరీంనగర్ రహదారిలోని దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. భవనాల్లోని సెల్లార్లలో భారీగా నీరు ఉండడంతో దుకాణాలు తెరచుకోలేని పరిస్థితి నెలకొంది. కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అందులోని సామగ్రి పూర్తిగా నీట మునిగాయి. 111 చెరువులు, కుంటలు వరద నీటితో మత్తడి దూకుతున్నాయి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వెంకంపేట, ప్రగతి నగర్, సాయి నగర్ సహా పలు కాలనీల్లో వరద పోటెత్తుతోంది. వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహ వేగానికి ఓ కాలనీలోని కారు కొంత దూరం కొట్టుకుపోయింది. మరో కాలనీలో అమ్మకానికి ఉంచిన గణేష్ విగ్రహం కొట్టుకుపోయింది. మరో చోట కారు నీటిలో కొట్టుకుపోకుండా యజమానులు దానిని తాడుతో కట్టేశారు. కొత్తకలెక్టరేట్ ప్రాంగణంలోనూ భారీ వర్షపు నీరు చేరింది. సిరిసిల్లలో విద్యాసంస్థలకు.. కలెక్టర్ అనురాగ్ జయంతి సెలవు ప్రకటించారు. సహాయకచర్యల కోసం అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం 9398684240 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
మంత్రి కేటీఆర్ సమీక్ష
సిరిసిల్ల పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు చెరువులను గమనించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. వరదలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. చెరువులు, కుంటలు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలని... స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
సిరిసిల్లకు బయలుదేరిన రెండు డీఆర్ఎఫ్ బృందాలు సిరిసిల్లకు డీఆర్‌ఎఫ్ బృందాలు
సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు రెండు డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరాయి. బోట్లు, సహాయ చర్యల పరికరాలతో వెళ్తున్నాయి. సిరిసిల్లలో వరద సహాయక చర్యలు డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టనున్నాయి.
సిరిసిల్ల పట్టణాన్ని ముంచెత్తిన వరద