పట్టణాలు నీటి ముంపునకు గురికావటానికి కాలువలు, నాలాల ఆక్రమణ ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సిరిసిల్ల పట్టణం.. నీటిలో మునగడానికి ప్రధానంగా.. కాలువలు, నాలాలు ఆక్రమించడమేనని అధికారులు తేల్చారు. ముంపునకు కారణమైన ఆక్రమణలను తొలగించేందుకు సిద్దమైన క్రమంలోనే.. మరోసారి వరద నీరు ముప్పు తిప్పలు పెట్టింది. ఆ వరద నీరంతా రోడ్డెక్కి ఇళ్లలోకి వచ్చింది. దాదాపు రెండు రోజుల పాటు నీట మునిగిన ఇళ్లు ఇప్పుడు బురదతో నిండుకున్నాయి. పక్షం రోజుల క్రితం వెంకంపేట, ప్రగతినగర్, శివనగర్, అశోక్‌నగర్, పద్మానగర్, జయప్రకాశ్‌నగర్, అంబికానగర్, అనంతనగర్, సంజీవయ్యనగర్, సర్ధార్‌నగర్ కాలనీలను వరద నీరు పూర్తిగా ముంచేసింది. ఇప్పుడిప్పుడే ముంపు నుంచి తేరుకుంటున్న క్రమంలో... గులాబ్ పుణ్యమా అని మరోసారి శాంతినగర్ నీట మునిగింది. కొత్త చెరువు మత్తడి దూకడం వల్ల సీన్ రిపీట్ అయ్యింది.
గడువులోపు అందిచగలమా..?
పట్టణంలో శాంతినగర్‌లోని మరమగ్గ కార్మికులను వరద నిండా ముంచింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా చీరలు తయారు చేయగలమా..? అన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది. విద్యుత్ మోటార్ల ఆధారంగా మరమగ్గాలు నడిపించే తమను వరద నీరు నిండా ముంచేసిందని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించేందుకు ఈ నెల 15 ఆఖరు తేదీ కాగా.. వర్షం కారణంగా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇంతకు ముందు వర్షానికి దాదాపు 134 వస్త్రపరిశ్రమలు నీట మునిగాయి. ముడిసరుకులు తడిసిపోగా.. వాటిని ఆరబెట్టుకొని విద్యుత్ పరికరాలను సరిచేసుకొని సిద్ధమయ్యేసరికి... మరోసారి వరద తమ కొంప ముంచిందని కార్మికులు వాపోతున్నారు.