రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవాళ మరోసారి విచారణ జరగ్గా.. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) రాజేశ్వరరావు, చెన్నమనేని తరఫున న్యాయవాది రామారావు, పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరఫున రవికిరణ్ వాదనలు వినిపించారు. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని ఏఎస్‌జీ రాజేశ్వరరావు మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.