ఒకప్పుడు రోజంతా కష్టపడి నేసిన చీరలు అమ్ముడుపోక, వాటి నిల్వలు ఇళ్ళల్లో కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయేవి. చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కక, నేసిన వస్త్రాలను విక్రయించుకోలేక... దిక్కుతోచని స్థితిలో జీవన్మరణ పోరాటం చేసేవారు. అలసిపోయిన దేహాలతో... చివరికి వాటినే ఊరి తాళ్లుగా మార్చుకొని బలవన్మరణానికి పాల్పడిన దీన దుస్థితి ఆనాటి సిరిసిల్ల నేతన్నలది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు సమయం మారింది... విధానం మారింది. మారుతున్న సమాజంతో పాటు నేత కార్మికులూ మారుతున్నారు. సరికొత్త ఆధునికతను అందిపుచ్చుకుంటూ... కాలంతో పాటు వడివడిగా పరుగులు పెడుతున్నారు.
సిరిసిల్ల నేతన్నలు ఆధునికతను అందిపుచ్చుకుంటూ... తమ కళను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సరికొత్త పద్ధతిలో వస్త్ర సోయగాలు అందిస్తూ అబ్బురపరుస్తున్నారు. సిరిసిల్ల అంటే పాలిస్టర్, కాటన్ మాత్రమే ఉత్పత్తి చేస్తారనే అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరమగ్గాలపై సరికొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ జాక్వర్డ్ యంత్రంతో సరికొత్త వస్త్ర సోబగులతో ఔరా అనిపిస్తున్నారు.
సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ ఎలక్ట్రానిక్ జాక్వర్డ్ మరమగ్గంతో వస్త్రతయారీకి శ్రీకారం చుట్టారు. సరికొత్త డిజైన్లతో వస్త్రాలను రూపొందించడమే కాకుండా... తన ప్రత్యేకతను దేశవిదేశాలకు విస్తరింపజేస్తున్నారు. బెంగళూరులో జాక్వార్డ్ యంత్ర వినియోగంపై శిక్షణ పొంది... సిరిసిల్లలో ఆధునిక పద్ధతిలో వస్త్ర ఉత్పత్తితో ఆకట్టుకుంటున్నారు.