రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం బంగారం నిల్వలతో అదనపు ఆదాయం పొందుతోంది. భక్తులు కానుకగా సమర్పించిన బంగారాన్ని ఎఫ్డీల రూపంలో భద్రపరచి వచ్చే వడ్డీని ఆలయం పేరు మీద అధికారులు జమ చేస్తున్నారు. దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, కానుకలు సమర్పించుకుంటారు. దీంతో ఆస్తుల్లో రాజన్న ఆలయం అగ్రగామిగా నిలుస్తోంది. వార్షికాదాయంలోనూ రాష్ట్రంలో ముందజలో ఉంది.
వివిధ రూపాల్లో నిల్వలు
భక్తులు తమ కోర్కెలు తీరుతున్నాయనే నమ్మకంతో భారీగా బంగారు, వెండి కానుకలు సమర్పించుకుంటున్నారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతితో ఆభరణాల తనిఖీ కమిటీ ఆధ్వర్యంలో బంగారాన్ని తూకం వేసి ఆలయంలో బంగారం, వెండి నిల్వల లెక్కింపు చేపట్టారు. ఈ కానుకలు గోల్డ్ బాండ్ల రూపంలో, లాకర్లలో, అలంకరణల్లో ఉపయోగించే నగలతో పాటు మిశ్రమ బంగారంగా నిల్వలుగా ఉంది. 2019లో ఆలయంలో పేరుకుపోయిన బంగారాన్ని లెక్కకట్టి బ్యాంక్లో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో భాగంగా డిపాజిట్ చేశారు. ఆలయంలో జరిగే ప్రత్యేకపూజల్లో అమ్మవారికి అలంకరణ కోసం నగలు వాడుతుంటారు. ఇప్పటికి పలుమార్లు ఆలయంలోని బంగారం, వెండితో స్వామివార్లకు గర్భగుడిలో, వెండి వాకిలి బంగారు పూత కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ప్రస్తుతానికి ఎలాంటి తాపుడాలు చేయించే ఆలోచనలో యంత్రాంగం లేదు.
31.03.2020 వరకు ఉన్న నిల్వలు, సమకూరిన ఆదాయం:
ఆభరణాల రూపంలో బంగారం: 17కిలోల 707గ్రా.
వెండి: 781కిలోల166గ్రా.
బాండ్ల రూపంలో: 43కిలోల 426 గ్రా.