Ponnam Prabhakar inspected Kaleshwaram 9th package works : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు ప్రాజెక్టును మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్.. పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గ్రామీణ ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయని ప్రచారం చేసుకుంటున్న మంత్రి కేటీఆర్.. నియోజకవర్గంలో కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రాజెక్టును పూర్తి చేయాలని గతంలో ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులపై కోవిడ్ లాక్డౌన్ సమయంలో కేసులు పెట్టారని గుర్తు చేశారు. కేటీఆర్ కేవలం హైదరాబాద్కు మాత్రమే మంత్రిగా వ్యహరిస్తున్నారని సొంత నియోజక వర్గం సిరిసిల్లలో సమస్యలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా ఇవాళ సిరిసిల్ల పరిస్థితి ఉందని విమర్శించారు. సిరిసిల్ల జిల్లాలో ఇవాళ రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని.. అనేక మంది నిరుద్యోగులు ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- Global Recognition for kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ అవార్డు
- Ponnam Challenge to Harish Rao : 'దమ్ముంటే హరీశ్ రావు గుడాటిపల్లికి రావాలి'
మల్కపేట రిజర్వాయర్ పూర్తయినప్పటికీ, కింది స్థాయి వరకు సాగునీరు అందించడానికి కాలువలు, తూముల నిర్మాణం పూర్తి కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పక్షాన ఎన్నిసార్లు ప్రశ్నించినా పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం తొమ్మిద ప్యాకేజి పనులు పూర్తి కాకుండానే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ లాంటి 10, 11, 12 ప్యాకేజీలను ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని గుర్తు చేసిన ఆయన.. తెలంగాణ ఏర్పాడిన తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.