రాష్ట్రంలో దళిత బంధు నిధులతో నిర్మించిన మొట్ట మొదటి రైస్ మిల్లును రాష్ట్ర మంత్రి కే తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో ప్రారంభించారు. దళితబంధుతో వచ్చిన డబ్బులతో కొంతమంది కలిసి ఈ రైస్ మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. దీని ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. లబ్దిదారులకు పలు సూచనలు ఇస్తూ.. దళిత బంధు గురించిన పలు అంశాలను గురించి చర్చించారు.
దళితబంధు నిధులతో రైస్ మిల్లు:ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన సుదామల్ల రాజేశ్వరి, సుదామల్ల విజయ్ కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్య గ్రూపుగా ఏర్పడి ఈ రైస్ మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. రాజేశ్వరి భర్త సురేందర్, లింగయ్యలకు ఇప్పటికే లారీలు ఉన్నాయి. విజయ్ కుమార్ గల్ఫ్ నుంచి తిరిగొచ్చాడు. 30 లక్షల రూపాయలు పెట్టి మల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులో మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ముగ్గురికి దళితబంధు స్కీమ్ ద్వారా 30లక్షల రూపాయలు వచ్చాయి. ఈ రూ.30లక్షలతో పాటు బ్యాంక్ నుంచి మరికొంత డబ్బును పొందారు. ఇవన్నీ డబ్బులు పోగుచేసుకుని వీరందరూ గ్రూపుగా ఏర్పడి రైస్ మిల్లులను నిర్మించుకున్నారు. ఇటీవలే ఈ రైస్ మిల్లు నిర్మాణం అనేది పూర్తయ్యింది. మిల్లును ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరై మిల్లును ప్రారంభించారు.