కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి వద్ద ఐడీటీఆర్ పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.16.48 కోట్లు కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వం వంతుగా 20 ఎకరాల స్థలం అందించింది. రాష్ట్ర రవాణాశాఖ రూ.5 కోట్లు విడుదల చేసింది.
దక్షిణాదిన మూడు కేంద్రాలు
తరగతి గదులు, వసతిగృహ భవన నిర్మాణాలు.. శిక్షణా ట్రాక్ల పనులు పూర్తయ్యాయి. అశోక్ లేలాండ్ సంస్థ నిర్వహించే ఈ కేంద్రానికి కలెక్టర్ ఛైర్మన్గా ఉంటారు. జిల్లాలోని పది మంది ఉన్నతాధికారులతో కమిటీ పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా పది చోదక శిక్షణ కేంద్రాలున్నాయి. దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటకతో కలిపి తెలంగాణలో ప్రారంభిస్తే మూడోది అవుతుంది. ఇక్కడ ఒక విద్యార్థికి వసతితో పాటు.. చోదక శిక్షణ ఇవ్వాలంటే సగటున పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, యువతకు శిక్షణనిచ్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రత్యేకంగా రూపొందిస్తోంది.
మరమ్మతులపై అవగాహన
ఐడీటీఆర్‌లో శిక్షణ ఇచ్చేందుకు డిజిటల్ తరగతి గదులు, ఐదు రకాల వాహనాలు అందుబాటులో ఉంచారు. 3.25 కిలోమీటర్ల పరిధిలో నాలుగు, ఆరు వరుసల రహదారులను నిర్మించారు. ట్రాఫిక్ నిబంధనలు వివరించేలా ఏర్పాట్లు చేశారు. తరగతులతో పాటు డిజిటల్ త్రీడీ డైవింగ్ శిక్షణకు ప్రత్యేక గది ఉంది. చోదకులు వాహనాలు నడుపుతూ మధ్యలో ఇబ్బందులు తలెత్తినపుడు అత్యవసర మరమ్మతులపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచారు.