ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణం పీఎస్ నగర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. జడ్పీ అధ్యక్షురాలు ఎన్.అరుణతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ పరిశీలించారు.
ఏర్పాట్ల పరిశీలన..
ఆరోగ్య కేంద్రంలోని వెయిటింగ్ హాల్, వ్యాక్సినేషన్, పరిశీలన గదుల ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. వ్యాక్సినిచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంజక్షన్ తీసుకున్నాక ఏర్పడే దుష్పపరిణామాల (AEFI) నివారణ గురించి వివరించారు.
జిల్లాలో మొత్తం 16 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ప్రజలందరూ టీకా తీసుకోవాలి. ఆరోగ్య సిబ్బంది బలవంతం చేయొద్దు. ఎవరికి వారు ఇష్ట ప్రకారమే టీకా వేయించుకోవాలి. సమాచారాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలుసుకోవాలి.
-కృష్ణ భాస్కర్, జిల్లా కలెక్టర్