తెలంగాణ

telangana

ETV Bharat / state

మధ్యమానేరులో తగ్గిన నీటి నిల్వ.. తేలిన ఆలయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఉన్న మధ్యమానేరు ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గింది. ఫలితంగా గతంలో ముంపునకు గురైన ఆలయాలు పైకి తేలాయి. తాజాగా ఆలయాలు పైకి తేలడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన లెక్కలు తేల్చి.. పరిహారం చెల్లించాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మధ్యమానేరులో తగ్గిన నీటి నిల్వ
మధ్యమానేరులో తగ్గిన నీటి నిల్వ

By

Published : Apr 22, 2021, 8:11 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా మన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గింది. ప్రస్తుతం 14 టీఎంసీలకు చేరింది. ఫలితంగా గతంలో ముంపునకు గురైన ఆలయాలకు పరిహారం చెల్లించాలంటూ ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

బోయినపల్లి మండలం వరదవెల్లిలోని దత్తాత్రేయస్వామి ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలు గతంలో ముంపునకు గురయ్యాయి. వీటికి పరిహారం చెల్లించాలని ఆయా గ్రామస్థులు కోరినా.. అప్పట్లో అధికారులు అంచనాలు రూపొందించలేకపోవడంతో పరిహారం అందలేదు. ప్రస్తుతం జలాశయంలో నీరు 14 టీఎంసీలకు చేరింది. ఫలితంగా దత్తాత్రేయస్వామి ఆలయానికి వెళ్లేందుకు దారి ఏర్పడటంతో పాటు నీట మునిగిన ఆలయాలన్నీ తేలాయి.

అసలు విషయం ఇదీ..!

వరదవెల్లి గ్రామం గతంలో ముంపునకు గురి కాగా.. నిర్వాసితులు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీకి తరలివెళ్లారు. అక్కడే నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్నారు. అయితే వరదవెల్లిలోని హనుమాన్​ ఆలయం, బీరప్ప, ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలు ముంపు సమయంలో నీట మునిగాయి. వీటిలో హనుమాన్​ ఆలయానికి పరిహారం చెల్లించగా.. ఎల్లమ్మ ఆలయం, బీరప్ప, పోచమ్మ ఆలయాలకు అంచనాలు లేకపోవడంతో పరిహారం చెల్లించలేదు. దీనిపై అధికారులను సంప్రదించగా.. అంచనాలు లేవని చెప్పడంతో గ్రామస్థులు సైతం ఆ విషయాన్ని అక్కడికే వదిలేశారు.

ఇప్పుడు జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో దత్తాత్రేయస్వామి ఆలయానికి పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు. దాంతో పాటు జలాశయంలో నీటి నిల్వ ఉన్న సమయంలో భక్తులు గుట్టపైకి వెళ్లేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.

దీనిపై సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్‌రావు స్పందించారు. వరదవెల్లి ముంపు గ్రామంలోని ఆలయాలకు పరిహారం చెల్లింపు అంశాన్ని పరిశీలించి.. చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు

ABOUT THE AUTHOR

...view details