సిరిసిల్ల పోలీసులు విశ్వకర్మ సమావేశాన్ని సజావుగా నిర్వహించుకునే వెసులుబాటు కల్పించలేనంత అసమర్థంగా ఉన్నారా అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నారా అని పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతోందా.. లేక కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందా అని నిలదీశారు.
'అందుకోసమే విశ్వకర్మ సమావేశానికి అనుమతి నిరాకరించారా..?' - Chalo Sircilla updates
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు నిర్వహించ తలపెట్టిన విశ్వకర్మ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నారా అని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతోందా.. కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందా అని దుయ్యబట్టారు.
సిరిసిల్లలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలనుకున్న విశ్వకర్మ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కుంటిసాకులతో అనుమతిని నిరాకరిస్తూ.. భావ ప్రకటనా స్వేచ్ఛను పోలీసులు నిర్లజ్జగా ఉల్లంఘించారని ఆయన ధ్వజమెత్తారు.
ఉద్దేశపూర్వకంగా, అనాలోచితంగా కేటీఆర్ విశ్వకర్మ సమాజాన్ని అవమానించారని దాసోజు ఆరోపించారు. విశ్వకర్మలు ప్రొఫెసర్ జయశంకర్ వారసులు, సమాజ అభివృద్ధికి తోడ్పడే ఉత్పాదక శక్తులని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుతంగా విశ్వకర్మ సమావేశాన్ని నిర్వహించుకునే తమ ప్రజాస్వామ్య హక్కును హరించొద్దని కోరారు. ఈ క్రమంలోనే 'శాంతియుత విప్లవాలు అసాధ్యమైనప్పుడు, హింసాత్మక విప్లవాలు అనివార్యం అవుతాయి' అన్న వ్యాఖ్యను తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు గుర్తు చేయాలనుకుంటున్నానన్నారు. ఈ మేరకు దాసోజు ట్వీట్ చేశారు.