తెలంగాణ

telangana

ETV Bharat / state

Dalit Bandhu in Telangana: 'అణగారిన బతుకుల్లో.. కొత్త కాంతులు నింపుతున్న దళితబంధు' - పేదల పాలిట వరంగా మారిన దళితబంధు

Dalit Bandhu Scheme in Telangana : 'ట్రాక్టరో... కారో... లారీనో కొనుక్కోమని రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద మీకు రూ.10 లక్షలు మంజూరు చేయడం లేదు. దళితులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది.. సంపద సృష్టి జరిగితే మీరు బతుకుతూ మరో పది మందికి ఉపాధి కల్పించాలనేది ఈ పథకం ఉద్దేశం' సిరిసిల్లలో దళిత బంధు లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ అన్న మాటలివి. ఇందుకు తగ్గట్టుగా సిరిసిల్ల జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ అడుగులు పడుతున్నాయి.

Dalit Bandhu
Dalit Bandhu

By

Published : May 8, 2023, 7:57 AM IST

Dalit Bandhu Scheme in Telangana : తెలంగాణలో అణగారిన బతుకుల్లో దళితబంధు కాంతులీనుతోంది. తొలి విడత రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 13 గ్రామాలను ఈ పథకానికి ఎంపిక చేశారు. అందులో 206 యూనిట్లకు రూ.20.06 కోట్లు మంజూరయ్యాయి. 90 మంది వస్తు సామగ్రి విక్రయాలు, 58 మంది పశుపోషణ, 54 మంది చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన, నలుగురు చేపల పెంపకం, రవాణా రంగాలను ఎంపిక చేసుకున్నారు. వాటిలో రైస్‌మిల్లు, కోళ్లఫారం, చేపల పెంపకం, పెట్రోల్‌ పంపు వంటి వాటితో ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. దళిత బంధు సహాయంతో యజమానులుగా మారిన వీరంతా మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. లబ్ధిదారులకు వివిధ రంగాల నిపుణులు, అధికారులతో అవగాహన కల్పించామని జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి వినోద్‌ తెలిపారు.

అల్మాస్‌పూర్​లో దళితబంధు పథకంలో నిర్మించిన రైస్​ మిల్లు

రైస్‌మిల్లులో 14 మందికి ఉపాధి: ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన లింగయ్య, సురేందర్‌, విజయ్‌ ముగ్గురు లబ్ధిదారులు కలిసి దళిత బంధు పథకం ఎంపికకు ముందే అల్మాస్‌పూర్‌ వద్ద రెండెకరాలు కొనుగోలు చేశారు. నిధులు మంజూరయ్యాక రూ.25 లక్షలతో షెడ్డు నిర్మించారు. తర్వాత రైస్‌మిల్లుకు అవసరమైన యంత్రాల కొనుగోలుకు రూ.1.50 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నారు. బ్యాంకు రుణ పత్రాలను పరిశ్రమలశాఖ ద్వారా ఎంఎస్‌ఎంఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దీని ద్వారా రూ.75లక్షల వరకు రాయితీ అందనుంది. ఈ రైస్‌మిల్లులో హమాలీలు, ఆపరేటర్లు మొత్తం 14 మంది ఉపాధి పొందుతున్నారు.

హరిదాస్‌నగర్‌లో నిర్మాణంలోని పెట్రోల్ బంకు

బృందంగా ఏర్పడి పెట్రోలు బంకు: ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులు బృందంగా కలిసి పెట్రోలు బంకును ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం హరిదాస్‌నగర్‌లో 17 గుంటల స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇందులో పెట్రోలు బంకు నిర్మిస్తున్నారు. దీనికి ముందే నయారా అనే ప్రైవేటు ఇంధన సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. నిర్మాణం పూర్తయ్యాక డీజిల్‌, పెట్రోల్‌ కొనుగోలుకు రూ.30 లక్షలు రుణం ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉంది. తర్వాత వీటి విక్రయాల ద్వారా వచ్చే కమీషన్‌తో సిబ్బంది వేతనాలు, నిర్వహణ, రుణాలు చెల్లించేలా ప్రణాళికలు చేసుకున్నట్లు నిర్వాహకుల్లో ఒకరైన దేవరాజ్‌ తెలిపారు.

ఉప్పల్​లో నిర్మాణంలోని కల్యాణ మండపం

అయిదుగురు కలిసి కల్యాణమండపం: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌కు చెందిన వెంకటనారాయణ, రాజు, కుమారస్వామి, వెంకటయ్య, వీరయ్యలు అయిదుగురు కలిసి కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. వీరిలో ఇద్దరికి సొంత భూమి ఉండగా అందులో పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.25 లక్షల మేర వెచ్చించి షెడ్ల నిర్మాణం చేపట్టారు. మరో రూ.25 లక్షలతో చుట్టూ ప్రహరీ, ఫ్లోరింగ్‌, పైన రేకులు వంటి పనులు మిగిలి ఉన్నాయి. 20 మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.

గండిలచ్చపేటలో కోళ్లఫారం

తండ్రీకొడుకుల కోళ్లఫారం:తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన దుర్గయ్య, సుమన్‌ తండ్రీకొడుకులు. దళిత బంధు ద్వారా రూ.20 లక్షలు మంజూరయ్యాయి. వీటితో తమ సొంత వ్యవసాయ భూమిలో 20 గుంటల్లో రూ.12 లక్షలతో రెండు షెడ్లను నిర్మించారు. ఒక్కో దానిలో నాలుగు వేల కోడి పిల్లలను ఉంచారు. పిల్లల కొనుగోలు, దాణాకు రూ.8 లక్షలు ఖర్చు చేశారు. 30 రోజులుగా వీటిని పెంచుతున్నారు. వీటి సంరక్షణకు తండ్రీ కొడుకులతోపాటు మరో నలుగురు పని చేస్తున్నారు. పది రోజుల్లో విక్రయానికి సిద్ధమవుతాయని సుమన్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details