రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలను నిర్మించేందుకు వ్యవసాయశాఖ క్లస్టర్లను ఎంపిక చేసింది. జిల్లాలో 13 మండలాల్లో 2,53,950 ఎకరాల్లో సాగు విస్తీర్ణం కాగా 57 క్లస్టరుగా ఏర్పాటు చేశారు. 57 మంది ఏఈవోలకు గాను ప్రస్తుతం 46 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ముగ్గురు ఇతర జిల్లాకు డిఫ్యూటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం ఎనిమిది మంది ఏఈవోలను భర్తీ చేస్తున్నారు.
13 మండలాల్లో పది మంది వ్యవసాయాధికారులు మాత్రమే ఉన్నారు. పలువురికి ఇతర మండలాల బాధ్యతలనూ అప్పగించారు. రైతు వేదికల నిర్మాణానికి రెవెన్యూ, వ్యవసాయ శాఖలు 40 క్లస్టర్ పంచాయతీల్లో స్థలాన్ని పరిశీలించారు. మరో 17 పరిశీలనలో ఉన్నాయి.
రైతు వేదికలుగా ప్రగతి ప్రాంగణాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబరులో జిల్లాకు వచ్చిన సందర్భంగా రూ.53.85 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులను కేటాయించారు. వాటిలో సిరిసిల్ల నియోజకవర్గంలోని 92 పంచాయతీల్లో కేసీఆర్ ప్రగతి ప్రాంగణాలను నిర్మాణానికి ప్రతిపాదించారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు 31 నిర్మాణాలు పూర్తయ్యాయి. పది పంచాయతీల్లో స్థలాభావంతో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. పంచాయతీల పర్యవేక్షణలో ఉండే ప్రగతి ప్రాంగణాల క్లస్టర్ పంచాయతీల్లో రైతు వేదికలుగా మారనున్నాయి.
సాగుకు సహకారం
సాగుకు దన్నుగా నిలిచేలా రైతు వేదికలు నిర్మించనున్నారు. ఏ రైతు పట్టణాలకు వెళ్లకుండా సమీప ప్రాంతాల్లోనే అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా ఈ వేదిక నిలువనుంది. రైతులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వారికి అధికారుల ద్వారా అన్ని రకాల సహకారం అందించనున్నారు. రైతులకు పంట సమగ్ర విధానంపై శిక్షణనిస్తూ అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోనున్నారు. ఆధునిక సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, మేలు రకమైన విత్తనాల ఎంపిక, తయారీ సాగు మెలకువలతో అధిక దిగుబడులు సాధించడం. గిట్టుబాటు ధరలు పొందేలా వ్యవసాయశాఖ, అనుబంధ విభాగాల నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందనున్నాయి.
సమావేశాలకు కసరత్తు
నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసే విధానంపై గ్రామాల వారీగా రైతులతో చర్చించేందుకు జిల్లా వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నేల స్వభావం, సాగునీటి లభ్యత, ఆయా పంటల సాగు విస్తీర్ణం ఆధారంగా ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగుచేయాలనే దానిపై సమావేశమవుతారు. ఆయా పంటలకు సరిపడా విత్తనాలు, ఎరువులను ముందుగానే గ్రామాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటారు. మండలాల వారీగా వ్యవసాయ కార్డును రూపొందించి ఆయా పంటల మార్పిడికి అనుగుణంగా సాగుచేసేలా పంటల వివరాలు నమోదు చేస్తారు.