తెలంగాణ

telangana

ETV Bharat / state

సమాజ సేవే ఈ జవాన్​ అభిమతం.. అందుకే విద్యార్థులకు 'నిత్యపాలామృతం' - nitya palamruth project

CRPF SI Service to Children: దేశం కోసం గస్తీ కాసే జవాను.. భావి పౌరులకు తనవంతు సహాయమేదైనా చేయాలనుకున్నారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకం ఒక్కటే వారి ఎదుగుదలకు సరిపోదని గ్రహించారు. సరైన పౌష్టికాహారం అందించేందుకు "వైట్ వాలంటీర్ ఫౌండేషన్ " ప్రారంభించారు. సీఆర్పీఎఫ్​ సబ్ ఇన్పెక్టర్ అయిన శేఖర్ ప్రారంభించిన ఆ ఫౌండేషన్‌ కథేంటో ఇప్పుడు చూద్దాం.

crpf si nitya palamruth
సీఆర్​పీఎఫ్​ ఎస్సై ఆధ్యర్యంలో నిత్య పాలామృతం

By

Published : Mar 30, 2022, 7:14 PM IST

పాఠశాల విద్యార్థులకు రోజూ రాగిజావ పంపిణీ

CRPF SI Service to Children: అతడొక సీఆర్పీఎఫ్​ సబ్ ఇన్పెక్టర్... దేశానికి రక్షణ సేవలే కాదు. రేపటి పౌరులను మేధావులుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేయాలనుకున్నారు. 2018లో "వైట్ వాలంటీర్ ఫౌండేషన్" స్థాపించి.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శేఖర్‌.. సీఆర్పీఎఫ్​ సబ్ ఇన్పెక్టర్. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. 2012లో ఉద్యోగం వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు తోచిన సహాయం చేస్తూనే ఉన్నారు. అసోంలో పనిచేసేటప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పుస్తకాలు, బ్రెడ్ పంచిపెట్టేవారు. వారికి వ్యాయామ శిక్షణ, పాఠాలు చెప్పేవారు.

"వృత్తి రీత్యా చాలా రాష్ట్రాల్లో పనిచేశాను. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు విద్యార్థులు అల్పాహారం చేయకుండా స్కూల్​కు రావడాన్ని గమనించాను. దీంతో పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తుతుంది. ఈ సమస్యను అధిగమించడానికే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాను. వైట్​ వాలంటీర్​ ఫౌండేషన్​ను స్థాపించి విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి కార్యక్రమాల్లో ఉండకూడదని తెలిసి.. నేను వాలంటీర్​గా పనిచేస్తూ నా భార్యకు సంస్థకు అప్పగించాను. అంతేకాకుండా విద్యార్థులకు కంప్యూటర్​ శిక్షణ, యోగా, వ్యాయామం వంటివి నేర్పిస్తున్నాను." -శేఖర్, వైట్ వాలంటీర్ ఫౌండేషన్ స్థాపకుడు

ఫౌండేషన్​లో వాలంటీర్​గా: 2018లో తన ఆలోచనలకు భార్య కూడా తోడవడంతో "వైట్ వాలంటీర్ ఫౌండేషన్" అనే ఎన్జీవో స్థాపించారు. మొదట 2 ప్రభుత్వ పాఠాశాలలు దత్తత తీసుకున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా రోజూ పాలామృతాన్ని(రాగి జావ) అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటంతో ఎన్జీవో బాధ్యతలు భార్యకు అప్పగించి.. శేఖర్ వాలంటీర్‌గా ఉన్నారు. ప్రస్తుతం 5 పాఠాశాలల్లో సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అందిస్తున్నారు.

"మా కిచెన్​లో మేము ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం అల్పాహారం మాత్రమే కాదు. మధ్యాహ్న భోజనం కూడా తయారుచేస్తున్నాం. పరిశుభ్రత ప్రమాణాలన్నీ పాటిస్తూ.. మన ఇంట్లో తయారు చేసుకునే విధంగా వండుతున్నాం. అన్నం, పాలు కన్నా రాగిజావ చాలా మంచి పౌష్టికాహారం. ఐసీఎమ్‌ఆర్‌ కూడా నిరూపణ చేసింది. అందుకే నేను నా పిల్లలకూ రాగిజావ అల్పాహారం కింద ఇస్తున్నాను. మీరూ ఈ గొప్ప కార్యక్రమంలో భాగం కావాలని కోరుకుంటున్నాను." -జ్యోతి, సంస్థ డైరెక్టర్​

రోజంతా చలాకీగా:మొదట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకి రాగిజావ ఇవ్వడాన్ని ఇష్టపడలేదు. పిల్లలకి జలుబు చేస్తుంది మా పిల్లలకి ఇవ్వకండి అనేవారు. పాఠశాల ప్రిన్సిపల్‌ చొరవ తీసుకుని వారికి భరోసా ఇవ్వడంతో ఒప్పుకున్నారు. ఇప్పుడు తరగతి గదిలో పిల్లలు చలాకీగా ఉంటున్నారని ప్రధానోపాధ్యాయురాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలా జావ పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు.

"రోజూ 250కి పైగా విద్యార్థులు తరగతులకు హాజరవుతారు. 80 శాతం పైగా విద్యార్థులు అల్పాహారం చేయకుండా వస్తున్నారు. రాగి జావ ఇవ్వడం ద్వారా వారు చలాకీగా ఉంటున్నారు. ఇందులో చాలా వరకు పోషకాలు ఉంటాయి. విద్యార్థులు ఇంట్లో అన్నం కూడా తినకుండా ఇక్కడికే వచ్చి రాగిజావ తీసుకుంటున్నారు. ఫలితంగా బరువు కూడా పెరిగారు. ఇంత గొప్ప సేవ చేస్తున్న వైట్​ వాలంటీర్​ ఫౌండేషన్​కు ధన్యవాదాలు." -జయమ్మ, ప్రధానోపాధ్యయురాలు, యాప్రాల్ ప్రాథమిక పాఠశాల

నైపుణ్య శిక్షణ:ప్రస్తుతం ఈ ఎన్జీవోలో తెలంగాణ వ్యాప్తంగా 200 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరు విద్యార్థులకు పాలామృతం అందించడమే కాక.. సమయాన్ని బట్టి కంప్యూటర్ శిక్షణ, యోగా, వ్యాయామం వంటివి నేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని వాలంటీర్లు చెబుతున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఈ పాలామృతంలో భాగంగా అందిస్తున్న రాగిజావలో బాదం పప్పు పౌడర్, పాలు కలిపి వేడివేడిగా అందిస్తున్నారు. వారానికి 3 రోజులు ఉప్పుతోనూ.. మూడు రోజులు బెల్లంతోనూ తయారు చేసిన జావను ఇస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు సరైన పోషక పదార్థాలు అందుతాయని వీరు చెబుతున్నారు.

వైట్​ వాలంటీర్​ ఫౌండేషన్​ అందిస్తున్న రాగిజావతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది విద్యార్థులు రాత్రి మాత్రమే అన్నం తిని ఉదయం ఏమీ తినకుండా వస్తున్నారు. అలాంటి వారికి వీరు అందిస్తున్న పాలామృతం మంచి ఫలితాలనిస్తుంది. ఈ నిత్యపాలామృతం అందించేందుకు నెలకు వేలల్లో ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో మరికొన్ని పాఠశాలలు దత్తత తీసుకుని ఈ కార్యక్రమం విస్తరించడమే లక్ష్యమని అంటున్నారు వైట్ వాలంటీర్ బృందం. సమాజ సేవ చేయాలనుకునే వారు ఎవరైనా సరే ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఈ బృందం కోరుతోంది.

ఇదీ చదవండి:Jeevan Lite: ఐఐటీ హైదరాబాద్​ పరిశోధకుల ఏడాదిన్నర కృషి ఫలితం.. "జీవన్​ లైట్​"

ABOUT THE AUTHOR

...view details