సిరిసిల్ల కాటన్ పరిశ్రమ(cotton industry) ఇబ్బందులతో సతమతం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 68 వేల మరమగ్గాలుంటే.. సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోనే 38 వేలున్నాయి. వాటిపై పాలిస్టర్, కాటన్ వేర్వేరుగా వస్త్రోత్పత్తి జరుగుతోంది. పాలిస్టర్ వస్త్రం తేలిగ్గా, అందంగా ఉంటుంది. కాటన్ దుస్తులు సౌకర్యవంతంగా ఉంటూనే సొగసునూ ఇనుమడింపజేస్తాయి. కాటన్ వస్త్రాధారణ ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.
సంక్షోభంలో..
నూలు ధరల పెరుగుదలతో ఉత్పత్తి చేసిన వస్త్రానికి విఫణిలో గిట్టుబాటు ధర లభించకపోవడం లేదు. ప్రభుత్వ ఆర్డర్లలోనూ పాలిస్టర్కే ప్రాధాన్యత ఇవ్వడంతో కాటన్ వస్త్రోత్పత్తి తగ్గిపోయింది. దాని అనుబంధ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. జిల్లాలో పదిహేనువేలకు పైగా మరమగ్గాలుంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 200లకు పడిపోయిందంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏడాది కాలంగా చిన్నపన్న(అడ్డంలో 36 ఇంచులు వస్త్రం వచ్చే)మరమగ్గాలు తక్కుకింద అమ్ముతున్నారు. పెద్దపన్నవి చీరల ఉత్పత్తులకు అప్గ్రేడ్ చేసుకున్నారు. నాలుగేళ్లుగా విపణిలో పోటీని తట్టుకుని నిలదొక్కుకునేలా కాటన్ ఉత్పత్తులను తీర్చిదిద్దాలనే ప్రణాళికలేవి కార్యరూపం దాల్చడం లేదు.
వందలాది మంది
జిల్లాలో నిత్యం 1.50 లక్షల మీటర్ల కాటన్ వస్త్రోత్పత్తి జరిగేది. ప్రస్తుతం పదివేల మీటర్లు కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. మహిళలు ధరించే పెట్టీకొట్, లంగా, నైటీల తయారీకి ఉపయోగించే వస్త్రానికి జిల్లా పరిశ్రమ ప్రసిద్ధి. ఇక్కడి పరిశ్రమ వర్గాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. చెన్నై, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చేవి. దీనికి అనుబంధంగా వందలాది మంది మహిళలకు దుస్తుల తయారీతో ఉపాధి లభించేది.