రైతు వేదికల నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హెచ్చరించారు. బుధవారం ఆయన.. రైతు వేదికల నిర్మాణ ప్రగతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దూరదృశ్య సమీక్ష ద్వారా చర్చించిన అంశాలపై అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, అంజయ్యలతో కలిసి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో నిర్మిస్తున్న 57 రైతు వేదికలను త్వరగా పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, ఏఈలు తప్పనిసరిగా అందుబాటులో ఉండి క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. నిర్మాణానికి సరిపడా కూలీలను అందుబాటులో ఉంచుకొని పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆదివారం కల్లా అన్ని వేదికలు బేస్మెంట్ లెవెల్‌ను పూర్తి చేసుకునేలా ఉండాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని పాలనాధికారి హెచ్చరించారు.