Medical Survey in Rajanna Sirisilla District : రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన చల్మెడ లక్ష్మినర్సింహరావు వైద్యరంగంలో స్థిరపడటంతో.. తన స్వగ్రామంతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను రెండు నెలల నుంచి వికాస తరంగిణి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించి.. అవసరమైన వారికి ఉచిత వైద్యం, ఔషధాలు అందిస్తున్నారు. అంతేకాకుండా అన్నిరకాల శస్త్రచికిత్సలను తమ ఆసుపత్రిలోనే చేపడుతున్నట్లు చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ఛైర్మెన్ లక్ష్మినర్సింహరావు తెలిపారు. మెడికల్ కళాళాలకు చెందిన 70మంది వైద్యులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సర్వేలో కుటుంబ నేపథ్యం, ఆహార వ్యవహారాలు, వారసత్వంలో రుగ్మతలు, రక్తపోటు,మధుమేహం ఇతరత్రా వ్యాధులకు సంబంధించిన తదితర వివవరాలను సేకరిస్తారు. రక్తపోటు ఉంటే ఇప్పటికే వినియోగిస్తున్న మందులు ఏమిటి? దాని వల్ల ఏమైనా కొత్త జబ్బులు వస్తున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంటింటా సర్వే నిర్వహించడం.. ఆ తర్వాత ఉచితంగా మందులు అందించడం పట్ల గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మెడికల్ క్యాంపు అంటే కేవలం ఒక రోజు వచ్చి మందులు ఇచ్చి వెళ్లడం కాకుండా.. కుటుంబ సభ్యులకు అన్నివైద్య పరీక్షలు నిర్వహించి ఖరీదైన శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదైన వేళ.. చల్మెడ లక్ష్మినర్సింహరావు ఇంటింటా సర్వేలు నిర్వహించి వైద్యం చేయించడం అభినందనీయమని స్థానికులు అంటున్నారు