కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మధ్యమానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టపై కొత్తగా నిర్మించిన రోడ్డు కుంగడం చర్చనీయాంశంగా మారింది. గతంలో బోగం వర్రె వద్ద చౌడు మట్టి కారణంగా నీరు లీకేజీ అవుతుందన్న సమాచారం మేరకు మట్టి కట్టను తవ్వి మళ్లీ రోడ్డు వేశారు. ఆ నిర్మాణం పూర్తైన తర్వాత ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడమే కాకుండా కిందికి వదిలారు. కొత్తగా నిర్మించిన రోడ్డు లోపలికి కుంగడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టపై కుంగిన రహదారి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కుదురుపాక వద్ద మధ్యమానేరు బ్యాలెన్సింగ్ రిజర్వయర్ కట్టపై కొత్తగా నిర్మించిన రోడ్డు కుంగింది. కుంగడం సహజమేనని, నాణ్యతలో ఎలాంటి లోపం లేదని, మళ్లీ సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు.
కొత్తగా వేసిన మట్టి రోడ్డుకు సరిగ్గా రోలింగ్ చేయకుండానే తారు వేశారని.. అందుకే రోడ్డు కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బోగం వర్రెతో పాటు మన్వాడ నుంచి ప్రాజెక్టుపైకి ఎక్కే మార్గంలోను రహదారి కుంగిపోయింది. ఆ రోడ్డు కుంగడం అక్కడి వరకే ఆగిపోతుందా మరింత దెబ్బతింటుందా అన్న అనుమానం వ్యక్తం అవుతుండగా అధికారులు మాత్రం అలా కుంగడం సహజమేనని వివరణ ఇచ్చారు. నాణ్యతలో ఎలాంటి లోపం లేదని, మళ్లీ సరిచేస్తామని మధ్యమానేరు ఈఈ రామకృష్ణ వివరించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు