రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. తెరాస ప్రభుత్వంపై భాజపా ఆఖరి పోరాటానికి సిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్‌లైన్ విధించారు. దీపావళి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు ఇవ్వాలని లేకుంటే నిరుద్యోగులతో హైదరాబాద్‌లో మిలియన్ మార్చి నిర్వహిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్‌తో తెరాస ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు.
తెలంగాణలో మార్పు కోసం చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర.. మహాసంగ్రామ యాత్రగా మారిందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ అంకిరెడ్డిపల్లెలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ప్రపంచమంతా మోదీ మోదీ అని.. దేశమంతా యోగి యోగి అని.. అంటున్నారన్న సంజయ్.. తెలంగాణలో మాత్రం రోగి రోగి అని నినదిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉపఎన్నికలు వస్తుంటే.. రేపే ఉద్యోగాల నోటిఫికేషన్ అని హామీలిచ్చి.. ఎన్నికలయ్యాక ఫాంహౌస్కెళ్లి పడుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని సంజయ్ అన్నారు.
'ఇంటికో ఉద్యోగం ఏమైంది? డీఎస్సీ ఏమైంది? విద్యా వలంటీర్లను తొలగించిండ్రు. 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేశారు. విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నరు. కోరుట్లలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విద్యా వలంటీర్లను నియమిస్తే సంబంధిత ఎంఈవో, ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేసిండ్రు. వాళ్లు చేసిన తప్పేంటి? తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలి. లేనిపక్షంలో భాజపా తడాఖా చూపిస్తాం.