Bandi sanjay on budget session: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను ఆహ్వానించకుండా అవమానపరిచారని విమర్శించారు. రాష్ట్ర ప్రథమ మహిళను అవమానపరడం.. రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించడమేనని సంజయ్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వెనుక ఉద్దేశం ఏంటో కేసీఆర్ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా.. వేములవాడలోని రాజన్న ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధికి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద నిధులు తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నం చేస్తానని సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా.. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
'మహిళ గవర్నర్ కనుకనే బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించలేదు. ఆమేమైనా సొంతంగా ప్రసంగిస్తారా.. మీరు ఇచ్చిందే చదువుతారు కదా.. మరెందుకు పిలవలేదు. ఇప్పటి వరకు గవర్నర్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అవమానపరిచినట్లే..'