Bandi Sanjay Visit Vemulawada: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్... ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రసాదం పథకం కింద చేర్పించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని పలుమార్లు అధికారులను కోరినప్పటికి సహకరించడం లేదన్నారు.
ప్రజల మాదిరిగానే రాజన్నను కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. వందల కోట్లు ఇస్తానని చెప్పడమే తప్ప ఇంతవరకు చేసిందేమిలేదన్నారు. తానే హిందువని గొప్పగా చెప్పుకొనే ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తే ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో ఆంధ్రోళ్లు అడ్డుకుంటున్నారని చెప్పేవారని... ఇప్పుడు ఎందుకు చేయడం లేదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అంటే మీకు ఎందుకింత నిర్లక్ష్యం? మీరు పట్టించుకుంటారా లేదా? మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇంతకముందు ఆంధ్రోళ్లు ఆపారు అనేవాడివి... ఇప్పుడు నిన్ను ఎవరు ఆపుతున్నారు? నిజమైన తెలంగాణ వాదివి కదా నువ్వు. దీనిపై సీఎం స్పందించాలి. భక్తులు పడుతున్నట్లు అవస్థలు ఊరుకేపోవు గుర్తుంచుకోవాలి. కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయిన తర్వాత ముగ్గురు, నలుగురు ఈవోలు మారారు. ప్రతిపాదనలు ఇవ్వండి. ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ గుడిని అభివృద్ధి చేసే బాధ్యత నాదని పలుమార్లు చెప్పా.