రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ (సహకార విద్యుత్తు సరఫరా సంస్థ) డైరెక్టర్ల స్థానాలను భారత్ రాష్ట్ర సమితి మద్దతుదారులు క్లీన్‌స్వీప్ చేశారు. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలనూ కైవసం చేసుకున్నారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించగా.. సోమవారం వేములవాడలో ఓట్లు లెక్కించారు.
వేములవాడ గ్రామీణ స్థానంలో ఉత్కంఠ:వేములవాడ గ్రామీణ స్థానం ఫలితంపై అర్ధరాత్రి వరకు ఉత్కంఠ నెలకొంది. తొలుత బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆకుల దేవరాజుపై బీజేపీ బలపరిచిన అభ్యర్థి జక్కుల తిరుపతికి 6 ఓట్ల మెజారిటీ వచ్చినట్లు సమాచారం. ఫలితం వెల్లడించక ముందే రీకౌంటింగ్ చేపట్టాలని అధికారులను బీఆర్ఎస్ అభ్యర్థి దేవరాజు కోరారు. రాత్రి 11.15 వరకూ కొనసాగిన రీకౌంటింగ్‌లో దేవరాజు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
చందుర్తి స్థానం లెక్కింపులో చివరి రెండు రౌండ్లు మిగిలి ఉండగా అధికార పార్టీ వారితో ఎన్నికల సిబ్బంది లాబీయింగ్ చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు లెక్కింపు నిలిచిపోయింది. ఆ సమయంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అల్లాడి రమేశ్ 18 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆందోళనకారులతో ఎన్నికల అధికారులు మాట్లాడిన తరవాత లెక్కింపు తిరిగి ప్రారంభించారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ బలపరిచిన శ్రీనివాస్‌రావుకు రెండు ఓట్ల మెజారిటీ వచ్చింది.
కేంద్రం బయట ఉన్న రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీలు ఝుళిపించి ఇరువర్గాలను చెదరగొట్టారు. రీకౌంటింగ్ చేపట్టాలని అల్లాడి రమేశ్ విన్నవించుకోగా ఎన్నికల అధికారి తిరస్కరించారు. బీఆర్ఎస్ బలపరిచిన శ్రీనివాసరావు గెలిచినట్లు రాత్రి 10 గంటల సమయంలో అధికారులు ప్రకటించారు. గంభీరావుపేట స్థానం ఓట్ల లెక్కింపునకు స్ట్రాంగ్ రూం నుంచి తీసుకొచ్చిన బ్యాలెట్ పెట్టెకు సీలు తీసి ఉందంటూ స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు ఆందోళనకు దిగారు.