తెలంగాణ

telangana

ETV Bharat / state

Liquor: బెల్ట్​ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

లాక్​డౌన్​లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బెల్ట్​ షాపుల్లో భారీగా మద్యం విక్రయిస్తున్నారు. వైన్సులు మధ్యాహ్నం 2 గంటలకే మూసివేస్తుడటంతో ఆ తర్వాత బెల్ట్​ షాపుల హవా నడుస్తోంది.

Liquor: విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Liquor: విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

By

Published : Jun 6, 2021, 6:19 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలను మధ్యాహ్నం తర్వాత మూసివేస్తుండటంతో బెల్టు దుకాణాల్లో విక్రయాలు జోరందుకుంటున్నాయి. మద్యం దుకాణాలు మూసివేయడంతో పట్టణాలు, గ్రామాల్లో గల్లీకో బెల్టు దుకాణం వెలిసింది. వాటిపైనే మందుబాబులు ఆధారపడుతున్నారు. ఇక్కడికి అడ్డంకుల్లేకుండా మందు నిల్వలు చేరుతుండటంతో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీంతో లాభాలు దండుకొనేందుకు కొన్ని లైసెన్స్‌డ్‌ దుకాణాల నిర్వాహకులు నేరుగా విక్రయించే సరకు కంటే తమతో సంబంధాలున్న బెల్టు దుకాణాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఇదే అదనుగా కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి.. వ్యాపారం మందగించిన వారు కొందరు అడ్డదారుల్లో మద్యం విక్రయాల ద్వారా నష్టాల లోటును పూడ్చుకుంటున్నారు.

పోలీసులు కంటపడకుండా జాగ్రత్తలు

ఇళ్ల మధ్యలో ఉన్న దుకాణాల వద్ద మద్యం కొనుగోలు చేస్తూ.. పోలీసులు కంటపడని మారుమూల ప్రాంతాలు.. పాఠశాలల ప్రాంగణాల్లో తిష్ఠవేస్తున్నారు. సాయంత్రం లాక్‌డౌన్‌ అమలు తీరుపై గస్తీ తిరుగుతున్న పోలీసులకు మానేరువాగు, పట్టణ శివారు ప్రాంతాల్లో పట్టుబడుతున్నారు. ఇలా పట్టుబడిన వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పోలీసులు ఐసోలేషన్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇలా ఒకసారి పట్టుబడినవారికి మరునాడు పరీక్షలు చేయించగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటికీ అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఎక్సైజ్‌శాఖ కేసులు నమోదు చేసింది. వీటిద్వారా రూ.50 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో మాత్రం భారీగా లోటు కనిపించడం లేదు.

ధరల దందా...

రోజులో ఎప్పడు కావాల్సినా మద్యం దొరికే వీలు ఉండటంతో ప్రభుత్వ దుకాణంలో ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారు. అయినా మందు బాబులు వెనక్కి తగ్గడం లేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో లైసెన్సుడ్‌ దుకాణాల వారు సిండికేట్‌ అయ్యారు. వారు తమ పరిధిలోని గొలుసు కట్టు దుకాణాలకు గరిష్ఠ చిల్లర ధర కంటే (ఎమ్మార్పీ) అదనంగా రూ.20లకు విక్రయిస్తున్నారు. వారు సీసాపై మరో రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెంచి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఓ బ్రాండ్‌కు చెందిన క్వాటర్‌ ఎమ్మార్పీ ధర రూ.170 ఉంటే, గొలుసుకట్టు దుకాణానికి వచ్చే సరికి దాని ధర రూ.210గా ఉంటోంది. చివరికి మద్యం ప్రియుల జేబుకు చిల్లు పడుతోంది.

బెల్ట్​ షాపుకు వేలం

తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూరులో మద్యం బెల్ట్‌ దుకాణం నిర్వహించుకునేందుకు వేలం హోరాహోరీగా సాగింది. తొలుత పాటలో పాల్గొనే ఐదుగురు ఒక్కొక్కరు రూ.5 వేలు డిపాజిట్‌ చేశారు. పంచాయతీకి ఏడాదికి రూ.లక్ష చెల్లించేందుకు సిద్ధమైన వ్యక్తికి గ్రామంలో దుకాణం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం.

ఇదీ చదవండి: Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details