తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2021, 7:28 AM IST

ETV Bharat / state

ఆకర్షణీయమైన డిజైన్లతో బతుకమ్మ చీరలు

బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలు ఈ ఏడాది మరింత ఆకర్షణీయ డిజైన్లతో రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చీరలు తయారీ మొదలైంది. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి పరిశ్రమ ఈ ఏడాది 9 నెలల ముందు నుంచే చీరల ఉత్పత్తిని ప్రారంభించింది. గతేడాది 22 వేల మరమగ్గాలపై కోటి చీరలు ఉత్పత్తి చేయగా.. ఈసారి మరమగ్గాలను 12 వేలకు కుదించారు.

bathukamma sarees with new designs in telangana
ఆకర్షణీయమైన డిజైన్లతో బతుకమ్మ చీరలు

ఆకర్షణీయమైన డిజైన్లతో బతుకమ్మ చీరలు

ప్రభుత్వం ఏటా పంపిణీ చేసే బతుకమ్మ చీరలు ఈ ఏడాది మరింత ఆకర్షణీయ డిజైన్లతో రూపొందనున్నాయి. సాధారణ మరమగ్గాలకు డాబీ, జకాట్‌ పరికరాలను జోడించి ఆధునికీకరించిన వాటిపైనే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ నిర్ణయించింది. దీంతో సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలో ఈ పరికరాలు అమర్చిన ఆధునిక మరమగ్గాలు ఎన్ని ఉన్నాయన్న అంశంపై ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించారు. టెక్స్‌టైల్‌ పార్కులో 1,200, పట్టణంలో 10,800 ఆధునిక మరమగ్గాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ల కోసం వస్త్రోత్పత్తిదారులు ఇప్పటికే చెన్నై, భీవండి, సూరత్‌ నుంచి డాబీ, జకాట్‌ ఆధునిక పరికరాలను కొనుగోలు చేసి వాటిని యంత్రాలకు అమర్చుకున్నారు. వీటిపైనే ప్రభుత్వం నిర్ణయించిన డిజైన్లతో బతుకమ్మ చీరల ఉత్పత్తి జరుగనుంది.

రెండు విడతలుగా 57.77 లక్షల చీరల ఆర్డర్లు

సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి పరిశ్రమ ఈ ఏడాది 9 నెలల ముందు నుంచే చీరల ఉత్పత్తిని ప్రారంభించింది. గతేడాది 22 వేల మరమగ్గాలపై కోటి చీరలు ఉత్పత్తి చేయగా.. ఈసారి మరమగ్గాలను 12 వేలకు కుదించారు. ఒక్కో కార్ఖానాలో సామర్థ్యాన్ని బట్టి కనిష్ఠంగా రెండు, గరిష్ఠంగా 4 మరమగ్గాలపై చీరలు, మిగతా వాటిపై ఇతర ఆర్డర్లు ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు రూపొందించారు. బతుకమ్మకు కోటి చీరల ఉత్పత్తి లక్ష్యం కాగా.. ఇప్పటికే రెండు విడతలుగా 57.77 లక్షల చీరల ఆర్డర్లను ఇచ్చారు.

రోజుకు 6 లక్షల మీటర్లు

ఆధునికీకరించిన మరమగ్గాలపై పని చేయడానికి కార్మికులకు నైపుణ్యం అవసరం. కొత్త పరికరాలు అమర్చడంతో కార్మికులపై పనిభారం పెరుగుతుంది. కార్మికుల కొరత కూడా ఏర్పడుతుంది. దీన్ని అధిగమించేందుకు ఇక్కడి వస్త్రోత్పత్తిదారులు బతుకమ్మ చీరల ఉత్పత్తి సమయంలో ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి సుమారు రెండు వేలకు పైగా కార్మికులను రప్పించి వారికి ఉపాధి కల్పిస్తారు. ఒక్కో మరమగ్గంపై రోజుకు రెండు షిప్టుల్లో సగటున 50 మీటర్లు ఉత్పత్తి అవుతుంది. 12 వేల మరమగ్గాలపై రోజుకు 6 లక్షల మీటర్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ఒక్కో కార్మికుడికి రోజుకు రూ.900

ఎనిమిది నెలల వ్యవధిలో 7 కోట్ల మీటర్లు(కోటి చీరలు) ఉత్పత్తి చేయాలి. డాబీ, జకాట్‌ పరికరాలు బిగించిన మరమగ్గాలపై పనిచేసే కార్మికుడికి మీటరుకు రూ.9.50, సాధారణ మరమగ్గాలపై పనిచేసే వారికి రూ.8.50 చొప్పున కూలీ ధర చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక కార్మికుడు సగటున నాలుగు మరమగ్గాలపై పనిచేస్తాడు. ఈ లెక్కన ఒక కార్మికుడికి రోజుకు రూ.900 వరకు గిట్టుబాటు అవుతుంది. బతుకమ్మ చీరల తయారీ ప్రక్రియ... సిరిసిల్లలో ముందుగానే ప్రారంభం కావటంతో...పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ABOUT THE AUTHOR

...view details