కృష్ణా జలాల(water disputes) వివాదంపై సీఎం కేసీఆర్.. తన వైఖరి స్పష్టంగా చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. గోదావరి, కృష్ణా జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎంల బండారం బయటపడుతుందని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమీషన్ల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన భాజపా దళిత మోర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్, కేసీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కమీషన్ల కోసమే
రాష్ట్రానికి రావాల్సిన నీటి విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే జగన్ దోచుకుపోతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం కేసీఆర్.. పక్క రాష్ట్రంతో కుమ్మకయ్యారని.. వారి వాటా విషయం తాము బహిరంగంగా చెబుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కేసు వేస్తే ట్రైబ్యునల్ ఎలా ఏర్పాటు చేస్తారని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ.. సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదని వ్యాఖ్యానించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
'రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎంల బండారు బయటపడుతుంది. కమీషన్లు, కాంట్రాక్టుల కోసం ఇరు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారు. జలవివాదాలపై కేంద్ర జలశక్తి నిర్ణయం.. ఏ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాదు. ఓ వైపు రాష్ట్రం నుంచి జగన్ నీటిని దోచుకుపోతుంటే.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ వాటాగా 299 టీఎంసీలు ఎలా ఒప్పుకున్నారో చెప్పాలి.'
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు