ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణకు భారీగా ఖర్చుపెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. 2011 సంవత్సరంలో సామాజిక భాగస్వామ్యంతో వార్షికోత్సవ సంబురాలకు బీజం పడగా గడిచిన తొమ్మిదేళ్లలో సుమారు రూ.కోటికి పైగా విరాళాల డబ్బు వెచ్చించడం విశేషం.\
ప్రజాభాగస్వామ్యంతో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు నూతన ఒరవడి సృష్టిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ఆంగ్లమాధ్యమ బోధనను ప్రవేశపెట్టుకుని రూ.లక్షల ఖర్చుతో బడుల బలోపేతానికి కృషి చేస్తున్న ప్రజలు.. విరాళాలు పోగుచేసుకోవడం ద్వారా పాఠశాలల వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించుకొని మరోసారి తమ ఐక్యమత్యాన్ని చాటుకుంటున్నారు.
పాఠశాలల్లో నూతనోత్తేజం
ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో 44 ప్రభుత్వ ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలున్నాయి. ఒక గురుకుల, ఒక ఆదర్శ, రెండు కేజీబీవీ పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సామాజిక భాగస్వామ్యం అలరారుతోంది. వీటిలో 35 పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధన జరుగుతోంది. 2010లో పదిర, దుమాల గ్రామాల్లో ప్రారంభమైన ‘ప్రజాభాగస్వామ్యంతో ఆంగ్లమాధ్యమ బోధన’ అనే నూతన ఒరవడి క్రమంగా అన్ని గ్రామాలకు విస్తరించింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పల్లెజనం ఏకతాటిపై నిలవగా విద్యార్థులంతా స్థానిక సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్నారు. 2015-2016 విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి, పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున మంజూరు చేసింది.