తెలంగాణ

telangana

ETV Bharat / state

టీకా పంపిణీకి సర్వం సన్నద్ధం : కలెక్టర్ - టీకా పంపిణీ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

రేపటి నుంచి ప్రారంభం కానున్న కొవిడ్ టీకా పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్​ స్పష్టం చేశారు. టీకా పూర్తి సురక్షితమైందని ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని.. వైద్యాధికారుల సూచనలు పాటించాలని అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి, వేములవాడ, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

all arrangements done for covid vaccination tomorrow
టీకా పంపిణీపై కలెక్టర్​ సూచనలు

By

Published : Jan 15, 2021, 6:58 PM IST

కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారి వివరాలు కొవిన్​ యాప్​లో నమోదు చేయడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్​ తెలిపారు. రేపటి నుంచి టీకా పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి, వేములవాడ, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. మొదటిరోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకా ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. తొలి విడతలో వైద్య, అంగన్​వాడీ సిబ్బందికి మాత్రమే ఇస్తామని తెలిపారు. జిల్లాకు 1280 కొవిషీల్డ్ టీకాలు వచ్చాయని పేర్కొన్నారు.

టీకా పంపిణీ ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా పాలనాధికారి

టీకా పంపిణీ ప్రక్రియ విధానం :

టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి మొబైల్​కు పూర్తి సమాచారం వస్తుందన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. టీకా వేసుకోవడానికి కేంద్రానికి వచ్చేవారు గుర్తింపు కార్డు తీసుకు రావాలని సూచించారు.

అరగంటసేపు పర్యవేక్షణ :

అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్ కృష్ణ భాస్కర్​

మొదట టీకా వేసుకునే వారిని వెయిటింగ్ హాల్​లోకి పంపిస్తారని.. యాప్​లో వివరాలను పరిశీలించిన అనంతరం టీకా ఇస్తారని తెలిపారు. తర్వాత ప్రత్యేక గదిలో 30 నిమిషాల పాటు పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. రెండో డోసు కోసం సంబంధించిన సమాచారం మొబైల్​కు సంక్షిప్త సందేశం వస్తుందన్నారు. టీకా తీసుకున్నవారిలో ఏవైనా దుష్ఫలితాలు కనిపిస్తే వెంటనే అవసరమైన చికిత్స చేయడానికి ఏఈఎఫ్​ఐ కిట్ అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని.. ఎవరికీ బలవంతంగా ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.సుమన్, మోహన్ రావు, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, మండలాల వైద్యాధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'వారంలో నాలుగురోజులు వ్యాక్సినేషన్... రేపే ప్రారంభం'

ABOUT THE AUTHOR

...view details