Young man committed suicide in Sircilla: టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఓ యువకుడు ఉద్యోగం రాదేమోనని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ బలవన్మరణానికి పాల్పడిన నవీన్ తండ్రితో ఈ రోజు ఫోన్లో మాట్లాడారు. తన కుటుంబాన్ని ఆదుకుంటామని అతనికి మంత్రి హామీ ఇచ్చారు. నవీన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖకు ఆయన ఆదేశాలు ఇచ్చారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన చిటికె నవీన్‌కుమార్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. నవీన్ హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. తను అర్హత కలిగిన అన్ని పోటీ పరీక్షలను రాస్తుండేవాడు. పలు ఉద్యోగాలు సాధించాలని ప్రయత్నించాడు. ఇటీవల జరిగిన గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతూనే సాప్ట్వేర్ రంగంలోనైనా జాబ్ సంపాదించాలని యత్నించాడు.
చివరికి ఏ ఉద్యోగం రాలేనందున మనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల ఇటీవల నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం మరింత మానసిక క్షోభకు గురి చేసినట్లుంది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోతనకు జాబ్ రాదేమోనని మనస్తాపం చెందిన నవీన్.. నిన్న ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఉరివేసుకొనే ముందు సూసైట్ నోట్ రాసి చనిపోయాడు. ఆ లేఖలో ఉద్యోగం లేని జీవితం వృధా అని రాశాడు. నవీన్ మృతదేహాన్ని పోలీసులు శవపరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టీఎస్పీఎస్సీ రద్దు చేసిన పరీక్షలు:రాష్ట్రంలో కలకలం రేపుతున్న అంశం ప్రశ్నాపత్రాల లీకేజ్. ఇందులో పలువురు నిందితులుగా ప్రభుత్వం భావించింది. వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తోంది. విచారణలో అనూహ్యమైన విషయాలు బయటపడడంతో కొన్ని పరీక్షలను రద్దు చేసింది. వాటిలో గ్రూప్ 1 ఒకటి. దీంతో పాటు ఏఈ, డీఏఓ, ఏఈఈ, వెటనరీ, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష తదితర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు. వీటిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఇవీ చదవండి: