కార్మిక క్షేత్రంలో మగువ తెగువ... మరమగ్గంతో భర్తకు చేయూత గత ఏడాది సిరిసిల్ల వస్త్ర వ్యాపార రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. మరమగ్గాల కార్మికుల వరుస బలవన్మరణాలతో పట్టణమంతా మరణ మృదంగం నిర్విరామంగా ప్రతిధ్వనించింది. కొండా కిష్టయ్య కుటుంబంతో మొదలైన మరమగ్గాల కార్మికుల బలవన్మరణాలు నెలల తరబడి కొనసాాగాయి. ఏ క్షణంలో ఏ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటాడోననే భయాందోళన ప్రతి ఇంట్లో ఉండేది. ఎటుచూసినా కార్మిక కుటుంబాల ఆర్తనాదాలు వినిపించడంతో 'సిరి'సిల్ల 'ఉరి'సిల్లగా మారిందంటూ పత్రిక, దృశ్య మాధ్యమాలు హృదయాన్ని కదిలించే కథనాలెన్నో ప్రపంచం ముందు ఉంచాయి.
ఈ క్రమంలో చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు గల్ఫ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. మరి కొంత మంది నేతపనికి స్వస్తి పలికి కూలీ పనులకు పయనమయ్యారు. ఉపాధి కోసం తోటి కుటుంబాలు వలసలు వెళుతున్నా ఏమాత్రం ఆందోళన చెందకుండా తమకు పరిచయమున్న చేనేత పరిశ్రమలోనే ఉపాధిని వెతుక్కున్నట్లు ఆడెపు లక్ష్మి చెబుతున్నారు.
భిన్నమైన ఆలోచన...
సాధారణ గృహిణి ఆడెపు లక్ష్మి భిన్నంగా ఆలోచన చేశారు. జీవనాధారమైన నూలుపోగులనే ఉరితాళ్లుగా చేసుకుని కళ్లముందే నేతన్నలు పిట్టల్లా రాలుతుంటే ఆమె మాత్రం భర్త ఆడెపు శ్రీనివాస్ కు భరోసాగా నిలవాలని సంకల్పించారు. గరిట తిప్పడం తప్ప... మరమగ్గం ముట్టని ఆమె భయం నుంచే మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారు. చితికి పోయిన చేనేత కుటుంబాల చితిమంటల సెగ తన కుటుంబ గడప తాకవద్దని భర్త వద్దే మగ్గంపై నేత పని నేర్చుకున్నారు.
ముగ్గురు పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని మరమగ్గాల కార్మికురాలిగా జీవితాన్ని ప్రారంభించారు. 30 ఏళ్లుగా చేయితిరిగిన కార్మికులకు ధీటుగా మరమగ్గాలపై వస్త్రాన్ని నేస్తూనే ఉన్నారు. మగవారు మాత్రమే చేయగలిగిన టాకాలు పట్టడం, భీములు నింపడం ఇలా ఒకటేమిటి వృత్తిలో చేయాల్సిన పనులన్నీ ఒంటిచేత్తో చేస్తున్నారు.
ఇదీ చదవండి:'ఆలోచించి మాట్లాడండి.. రాష్ట్రానికి భాజపా ఏం చేసింది?'