Green India challenge : హరిత తెలంగాణ సాధన దిశగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమం చిన్నారుల్లోనూ ఉత్సాహం నింపుతోంది. పర్యావరణహితంపై పిల్లల్లో చైతన్యం కలిగిస్తోంది. అందుకు ఉదాహరణే ప్రకృతిని ప్రేమించే ఈ చిన్నారి బ్లెస్సీ...
ప్రకృతికి పుట్టిన రోజు కానుక
రాజన్న సిరిసిల్ల జిల్లా సుద్దాలకు చెందిన చిన్నారి తన పుట్టిన రోజు సందర్భంగా పర్యావరణహిత కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంతో 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారు చేసింది. ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ... సిరిసిల్ల అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న బ్లెస్సీని... మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ వేదికగా అభినందించారు. పుట్టినరోజున హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు.
జీహెచ్ఎంసీ పార్కులో చిన్నారితో కలిసి మొక్కలు నాటుతున్న సంతోష్ కేటీఆర్ భరోసా
జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో చిన్నారి బ్లెస్సీతో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం బ్లెస్సీని మంత్రి కేటీఆర్ వద్దకు ఆయనే స్వయంగా తీసుకెళ్లారు. బ్లెస్సీ తల్లిదండ్రులను కేటీఆర్ అభినందించారు. ఏ అవసరమొచ్చినా అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
పిల్లల్లోనూ ఉత్సాహం
సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న ఎంపీ సంతోష్ కుమార్... గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పిల్లల్లో కూడా చైతన్యం నింపడంపై హర్షం వ్యక్తం చేశారు. పిల్లల్లో ప్రకృతి పట్ల అవగాహన పెరగాలన్న ఆయన... చిన్నారులను ప్రోత్సహించాలని అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే తమ బిడ్డతో సీడ్ బాల్స్ తయారుచేయించామన్న బ్లెస్సీ తండ్రి ప్రకాష్... తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం గొప్పవరమని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'ఏడున్నరేళ్లుగా సహకారం లేదు.. ఈసారైనా విభజన హామీలు అమలు చేయాలి'