gudem villagers saved the child life: హేమలత అనే ఆమె నెలలు నిండకముందే ఒక మగ శిశువుకి జన్మనిచ్చి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి ప్రాణం కూడా విషమంగా ఉండడంతో.. ఊరంతా ఒక్కటై ఆ చిన్ని ప్రాణాన్ని కాపాడి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన తిప్పారపు రమేశ్, జమున దంపతులు. అయితే వారి పెద్ద కుమార్తె హేమలత నెలలు నిండకముందే మగ శిశువుకు జన్మనిచ్చింది.
చేయిచేయి కలిపి సాయం చేసిన గ్రామస్థులు: దీంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న తల్లి కొడుకును కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. రమేశ్ నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఉన్న దాంట్లో రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. అయినా కూడా హేమలత ఆరోగ్యం క్షిణించి తుది శ్వాస విడిచింది. చివరకు పుట్టిన శిశువు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆ కుటుంబం మొత్తం తల్లడిల్లి పోయింది. వారికి ఓదార్పునిచ్చేందుకు ఒక్కసారిగా గ్రామస్థులు చేయిచేయి కలిపారు.
ఏడు నెలల బాబుకి జన్మనిస్తా ఆమె మృత్యువాత పడడం జరిగింది. ఆ బాబు ఇప్పుడు కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్నాడు. ఈ దయనీయ స్థితిని చూసి గ్రామస్థులం అందరం కలిసి వీళ్ల పరిస్థితిని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి గ్రామస్థులందరూ ఒక పెద్ద మొత్తంలో సహకరించి, ఎవరికి తోచినంత సాయం వారు చేశారు. మొత్తం రూ.43 వేల 500 ఆ కుటుంబానికి గ్రామస్థుల సహకారంతో అందించడం జరిగింది. -స్థానికులు