కనుమరుగైపోతున్న దేవాలయాలు పెద్దపల్లి జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు. జిల్లాలోని మంథని మండలం గుజపడుగు గ్రామానికి ఆమడ దూరాన పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న కాశీపేట దేవాలయాలు ఎంతో పురాతనమైనవి. నేడు ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరాయి.
కాకతీయుల నాటి దేవాలయం
కాశీపేట దేవాలయాలు సుమారు వెయ్యేళ్ల కిందట కాకతీయుల కాలంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ కోవెల 64 రాతి స్తంభాలతో నిర్మించారు. అచ్చు వేయి స్తంభాల గుడిని పోలి ఉంటుంది. ఈ సురస్థాన సముదాయాల్లో శివాలయం, రామాలయం, ఆంజనేయ ఆలయాలుండేవి. ఈ కట్టడాలను చూస్తే కాకతీయుల శిల్పకళావైభవం ఉట్టిపడుతోంది.
ఆలయ ప్రత్యేకత
ఈ ఆలయానికి ఉత్తర దక్షిణ ద్వారములు, తూర్పున రెండేసి చొప్పున ప్రధాన ద్వారాలుండేవి. ఏ దిక్కు నుంచి చూసినా నాలుగు సమానంగా కనిపించడం ఈ నిర్మాణం ప్రత్యేకత. రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు, ఆలయం పైకప్పుభాగంలో చక్రాలు, పద్మమలు, చూపరులను కట్టిపడేస్తాయి.
కనుమరుగైన ఖ్యాతి
కొన్నేళ్ల కిందట రజాకార్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాలను దొంగలు హస్తగతం చేసుకున్నారు. మరికొన్నింటిని ధ్వసం చేశారు. గుప్తనిధుల కోసం ఆలయంలో తవ్వకాలు చేపట్టి దేవాతా మూర్తులను మట్టిలో కలిపేశారు. విలువైన విగ్రహాలు ఎత్తు కెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ ఆలయం ఖ్యాతిని కోల్పోయింది.
ఎంతో విశిష్టత కలిగిన ఈ దేవాలయాన్ని కాలగర్భంలో కలిసిపోకుండా పురావస్తుశాఖ, ప్రభుత్వం దృష్టి సారించి దేవాలయానికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. భావితరాలకు చరిత్రను తెలియజేసేందుకున్న ఇటువంటి ఆలయాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఎంతో విలువైన సంపదను కాపాడుకున్నవాళ్లమవుతాం.
ఇది చదవండి: కాళేశ్వరంలో ఒక్క పంప్... 35వేల మోటార్లకు సమానం