Telangana Voters Opinion 2023 :రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నా.. రాజకీయ పరిణామాలు మాత్రం వేడెక్కిస్తున్నాయి. నేతలు గెలుపోటములపై స్పష్టత రాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఓటరు అంతరంగం (Telangana Voter Survey) తెలుసుకునేందుకు పోటీపడుతున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక అభ్యర్థులు మథనపడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు.
Voter Survey in Telangana 2023 :ఉదయాన్నే పల్లెలకు వెళ్లి ప్రచారం చేసినా (Telangana Election Campaign).. రాత్రివేళ ఆ గ్రామంలోని తమ పార్టీ పరిస్థితులపై కూపీ లాగుతున్నారు. ఏ పార్టీ ప్రచారం జరిగినా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. దీంతో వారు ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతారో తెలియక నేతలు, అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు బీఎస్పీ, కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఓటరు నాడి అర్థం కాక తికమక పడుతున్నారు.
'మా భవిష్యత్‌కు భరోసా ఇచ్చే నాయకుడికే ఓటేస్తాం'
కలవరపెడుతున్న పార్టీల మార్పు :ఇంకా ఎన్నికలకు వారం రోజులే సమయం ఉంది. ఇప్పటికే ఆయా పార్టీల్లోని నేతలు, అనుచరులు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మారుతుండటం అభ్యర్థులను కలవరానికి గురి చేస్తుంది. మరోవైపు ప్రచారం కన్నా తమ పార్టీ నుంచి ఎదుటి పక్షంలోకి చేరికలు లేకుండా చూసుకోవడం పైనే ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఎవరన్నా పార్టీ మారితే అవతలి పార్టీ నాయకులు.. తమ వైపు వచ్చేలా దృష్టి పెట్టడానికే ఎక్కువ సమయం సరిపోతోందని అభ్యర్థులు వాపోతున్నారు. మీ వెంటే మేము అంటూ కలిసి తిరిగిన నేతలు, శ్రేణులు మరుసటి రోజే కండువాలు మారుస్తున్నారని అంటున్నారు. దీంతో ఎవరిని నమ్మి వ్యూహాలు పంచుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.