పెద్దపల్లి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా నియంత్రిత సాగులో భాగంగా ఈ వానాకాలం సీజన్‌లో 80 శాతం మంది రైతులు వరి, పత్తి పంటల వైపు దృష్టి సారించారు. వాతావరణం అనుకూలించడం.... వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో....జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పంటల సాగు జరిగింది. జిల్లాలో 60 శాతం సన్న రకాలు, 40 శాతం దొడ్డు వరి రకాలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచించారు. తదనుగుణంగానే రైతులు 65శాతం సన్నాలు, 35 శాతం దొడ్డు రకాలు సాగు చేశారు. సన్నాల్లోనూ రైతులు తెలంగాణ సోనా రకాన్నే ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు. తక్కువ కాలపరిమితి కావడం, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రైతలు సోనా సాగుకే ఆసక్తి చూపారు.
జిల్లాలోని మంథని మండలంలో చాలా మంది రైతులు తెలంగాణ సోనా సాగుకే మొగ్గుచూపారు. గతంలో బీపీటీ రకాలను సాగు చేయడం వల్ల పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గాయని..ఈ ఏడు అధికారుల సూచనలతో తెలంగాణ సోనా సాగు చేశామని చెబుతున్న రైతులు పంట అనుకూలంగా ఉందంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు సలహాలను తీసుకుంటూ రైతులు జాగ్రత్తగా పంటను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో చేతికొచ్చే పంట కావడంతో...దిగుబడులపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.