పెద్దపల్లి జిల్లా మంథని.. ఆధ్యాత్మికత కార్యక్రమాలకు, ఎన్నో దేవాలయాలకు, వేదాలకు నిలయంగా ఉంటూ విరాజిల్లుతోంది. మంథని పట్టణానికి ఉత్తరాన పవిత్ర గోదావరి నది గలగల పారుతూ... గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వరుని చెంత భక్తులు కోరికలు నెరవేర్చుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాల నుంచి మంథని పట్టణానికి చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కొంత మంది కాలినడకన వచ్చి గోదావరి నదిలో స్నామాచరిస్తుంటారు. ఒకప్పుడు గోదావరి నది ప్రవాహం పైనుంచి కిందికి ప్రవహిస్తూ... ఉండేది. పవిత్ర స్నానాలు ఆచరించి నీటిని ఇంటికి తీసుకెళ్లేవారు. కొంతమంది గోదావరి నీటితోనే వంటలు చేసుకునేవారు. దాహం తీర్చుకునేవారు. నేడు మాత్రం గోదావరి తన జీవకళను కోల్పోతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి.. నీటిని ఎత్తిపోయడం వల్ల గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా నీరు నిల్వ ఉండటం వల్ల నీరు కలుషితం అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నది ప్రవహించే పరివాహకంలో ఎన్నో కంపెనీలు, సింగరేణి సంస్థ నుంచి వచ్చే వ్యర్థాలు కలుస్తుండటం వల్ల గోదావరి కలుషితంగా మారుతోంది. మంథని గోదావరి నదీ తీరం చాలా ఇరుకుగా ఉండటం వల్ల ఈ ప్రాంతం అనేక రకాలుగా కలుషితమవుతోందని భక్తులు వాపోతున్నారు. ఒకప్పుడు గోదావరి నదిలోని నీరు తాగే వారమని... ఇప్పుడు కనీసం స్నానం చేయడానికి కూడా భయపడుతున్నామని అంటున్నారు.
భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చినప్పుడు పూజలు చేసిన అనంతరం గోదావరి తీరంలో వస్తువులను, కవర్లను, తినుబండారాలను, మిగిలిపోయిన వ్యర్థాలను వదిలివేయడం, శార్ధ కర్మలు నిర్వహించడం చేసేవారు. దీనివల్ల నీరు అంతా కలుషితంగా మారిపోతోంది.