తెలంగాణ

telangana

ETV Bharat / state

పునరుత్పాదక శక్తిలో రామగుండానికి రాష్ట్రస్థాయి కీర్తి - పెద్దపల్లి వార్తలు

పునరుత్పాదక శక్తి వినియోగంలో పెద్దపల్లి జిల్లా రామగుండానికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలవడంతో ప్రభుత్వం నుంచి మూడు పురస్కారాలు దక్కాయి. హైదరాబాద్‌లోని సంస్థ ఆధ్వర్యంలో ఇంధన పరిరక్షణ అవార్డులు ప్రదానం చేశారు. రామగుండం రైల్వేస్టేషన్, నగరపాలక సంస్థకు బంగారు, ఎన్టీపీసీకీ రజతం రావడం విశేషం.

rama
rama

By

Published : Dec 21, 2020, 1:12 PM IST

Updated : Dec 21, 2020, 3:11 PM IST

పునరుత్పాదక శక్తి వినియోగంలో రామగుండం ఎన్టీపీసీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఇంధన, విద్యుత్తు వనరులను ఆదా చేయడం, ఆదర్శంగా వినియోగించే సంస్థలను గుర్తించి ప్రభుత్వం ఏటా పురస్కారాలు అందజేస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో సంస్థ ఆధ్వర్యంలో ఇంధన పరిరక్షణ పురస్కారాలు ప్రదానం చేశారు. రామగుండం రైల్వేస్టేషన్‌, నగరపాలక సంస్థలకు బంగారు పురస్కారాలు, ఎన్టీపీసీ(తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు)కు రజత అవార్డులు దక్కడం విశేషం. రాష్ట్ర శక్తి వనరుల శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు చేతుల మీదుగా ఆయా సంస్థల ప్రతినిధులు పురస్కారాలు అందుకున్నారు.

పునరుత్పాదక శక్తిలో రామగుండానికి రాష్ట్రస్థాయి కీర్తి

పర్యావరణ పరిరక్షణకు కృషి

పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం, ఆర్థిక వనరుల పొదుపులో ఎన్టీపీసీ గణనీయమైన ప్రగతి సాధించింది. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం చేపడుతూనే సౌర, పవన, జలశక్తి వనరులను సమృద్ధిగా వినియోగిస్తోంది. రామగుండం సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(ఎస్టీపీపీ) పరిశ్రమలో విద్యుత్తు శక్తి ఆదా కోసం ఎల్‌ఈడీ దీపాలు, ఎలక్ట్రికల్‌ మోటార్లు, సర్య్కులేటడ్‌ వాటర్‌ పంపులు వాడుతున్నారు. అతి తక్కువగా విద్యుత్తు అవసరమయ్యే విస్టా ఆటోమేషన్‌ మాడ్యూల్స్‌లను యంత్రాలకు సులభంగా అమర్చడం ద్వారా సంస్థ ఇప్పటికే 28 శాతం మేర బాయిలర్లు, మెటల్‌ యూనిట్లలో శక్తి వనరులను ఉపయోగిస్తోంది. ఏటా 70 వేల మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ గాలిలో వ్యాప్తి చెందకుండా అరికట్టడంతో గుర్తింపు దక్కింది.

నీటి సరఫరా వ్యవస్థలో కరెంటు ఆదా

పట్టణ, నగర స్థానికసంస్థల విభాగంలో రామగుండం నగరపాలక సంస్థ గతేడాది రజత అవార్డు అందుకోగా ఈసారి బంగారు పురస్కారం దక్కింది. ఈ ఏడాది నీటి వనరుల సరఫరాలో విద్యుత్తును ఆదా చేయడంతో పాటు పునరుత్పాదక వనరులను పొదుపుగా ఉపయోగించినందుకు పురస్కారానికి ఎంపికైంది. నగరంలో 21,300 నల్లా కనెక్షన్లున్నాయి. అమృత్‌ పథకం కింద దాదాపు మరో 19 వేల కనెక్షన్లు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం బల్దియా ప్రతి నెలా రూ.18 లక్షల విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సి వచ్చేది. సాగునీటి ప్రాజెక్టుల మూలంగా నీటి వనరులు పెరగడంతో పాటు ఎల్‌ఈడీ దీపాల వినియోగం వల్ల ప్రతి నెలా రూ.3 లక్షల వరకు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. 95 శాతం మేర శక్తి వనరుల వినయోగం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

రైల్వేస్టేషన్‌లో అతి తక్కువ వినియోగం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్‌ సబ్‌ అర్బన్‌ గ్రేడ్‌ స్టేషన్‌గా రామగుండం స్టేషన్‌కు గుర్తింపు లభించింది. 1929లో ఏర్పాటైన ఈ స్టేషన్‌ సికింద్రాబాద్‌-దిల్లీ మార్గంలో అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంది. కరోనా వ్యాప్తికి ముందు నిత్యం నడిచేవి 28, వారానికి రెండు నుంచి మూడు సార్లు ప్రయాణించేవి 50 రైళ్లు నడవడం ద్వారా 11.4 మిలియన్‌ ప్రయాణికుల రాకపోకలతో ఏడాదికి రూ.11.63 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. మొత్తం 176 కిలోవాట్ల విద్యుత్తు వ్యవస్థతో 1000 కేవీఏ సామర్థ్యం ఉన్న నియంత్రికలు, 11 కేవీ/415 వోల్టుల ఉపకేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు డివిజనల్‌ కార్యాలయంలో 100 కేవీఏ డీజిల్‌ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 2019-20 సంవత్సరానికి 42.69 కిలోవాట్ల విద్యుత్తు వినియోగానికి గాను 25.90 కిలోవాట్లు మాత్రమే ఉపయోగించింది. 2018-19లో 25.12 శాతం విద్యుత్తు శక్తిని ఉపయోగించింది. దక్షణిమధ్య రైల్వే పరిధిలో రామగుండం తర్వాత ఖమ్మం స్టేషన్‌ భవనానికి అతి తక్కువగా విద్యుత్తు వినియోగించారు.

ఇదీ చూడండి:పాత పద్ధతిలో ప్రారంభమైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు

Last Updated : Dec 21, 2020, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details