పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం గుడిపల్లి నుంచి గుంటూరు గ్రామం వరకు ఎస్సారెస్పీ చిన్న కాలువ ఉంది ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి ప్రాంతం కావడం వల్ల గతంలో కాలువ నీరు గ్రామం వరకు వచ్చేది కాదు. నీటి కోసం గ్రామస్థులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కొందరు గ్రామ శివారులో కొంతమేర కాలువను ఆక్రమించి దానిని మట్టితో పూడ్చారు. అయితే ప్రస్తుతం నీటిని ఎక్కువగా విడుదల చేయడం వల్ల ఆ నీరంతా గ్రామ శివారు కాలువ వరకు వచ్చి చేరుతోంది.
కాలువ ఆక్రమణతో నీరు ముందుకు పోయేందుకు వీలులేక సమీప ఎనిమిదో వార్డులోని గృహాలను ముంచెత్తుతోంది. ఇళ్ల చుట్టూ చేరిన నీరు సిమెంటు రహదారులపై కూడా పారుతోంది. వారం రోజులుగా నీరు వచ్చి చేరుతుండటం వల్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.