పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ సీతారామ సేవాసదన్ 2003లో ప్రారంభమైంది. పరులకు సేవచేయాలనే ఉద్దేశంతో నారాయణ గురూజీ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థమై ఈ సంస్థను నెలకొల్పారు. అప్పటి నుంచి కుల, మత, వర్గ, ప్రాంత బేధాలు లేకుండా ఆకలి అన్నవారి కడుపు నింపుతోంది ఈ సంస్థ. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తిండిలేక ఇబ్బంది పడుతున్న పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు, కూలీలకు ఆహారం అందిస్తోంది.
విద్యార్థులకు అండగా
సంస్థ తరఫున ఏటా గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులను గుర్తించి వారికి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తున్నారు. మెరుగైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
అడిగిన వారికి అన్నీతామై
మంథని పరిసరాల్లో ప్రాంతాల్లో పేదలకు అంత్యక్రియలు నిర్వహణ, గ్రామాల్లో మంచినీటి కష్టాలు రాకుండా బోర్లు తవ్వించడం, ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. నిరుద్యోగులకోసం కంప్యూటర్ శిక్షణ, మహిళలకు ఉషా జ్యోతి మహిళా వికాస కేంద్రం ద్వారా కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిన్నారులకోసం పార్కులు, క్రీడా ప్రాంగాణాలు నెలకొల్పారు. పేదలకోసం వైద్య శిబిరాలు నిర్వహణ, మందుల పంపిణీ, ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించారు.
లాక్డౌన్ వేళ మేమున్నామంటూ
లాక్డౌన్ సమయంలో పేదలకోసం మేమున్నామంటూ నిత్యం ఆహారం అందిస్తున్నారు. ఇంటింటికీ నిత్యావసరాలు పంపిణీ చేస్తూ అన్నివేళలా అండగా నిలుస్తోంది శ్రీసీతారామ సేవాసదన్.
ఇవీ చూడండి: ముంబయి నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్